New Districts In AP: కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి. జిల్లా కేంద్రాలు మార్చాలని, పేర్లు మార్చాలని, పరిధుల్లో మార్పు చేయాలని కోరుతూ ర్యాలీలు నిర్వహించారు. మదనపల్లెను జిల్లా కేంద్రం చేయాలని చిత్తూరు జిల్లా మదనపల్లె జిల్లా సాధన జేఏసీ, సమితి ఆధ్వర్యంలో సోమవారం పురపాలక సంఘం ముట్టడి నిర్వహించారు. తెదేపా, జనసేన, గిరిజన సంక్షేమ సంఘం, జిల్లా సాధన జేఏసీ, మాలమహానాడు, ఏపీ రైతు సంఘం ప్రతినిధులు ర్యాలీగా వచ్చారు. కొందరు కార్యాలయంపై ఎక్కి నినాదాలు చేశారు. ఆదోని జిల్లా సాధనకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఎమ్మిగనూరులో రాయలసీమ ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా కొనసాగింది.
సీఎం జగన్‌కు రైల్వేకోడూరు ఎమ్మెల్యే లేఖ
కడప జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ‘రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని కడప జిల్లాలోనే ఉంచాలి. లేదంటే రాజంపేటను జిల్లా కేంద్రం చేసి, అన్నమయ్య జిల్లాలో కొనసాగించాలి. ఈ రెండూ కాకుంటే కోడూరుకు 18 కిలోమీటర్ల దూరంలోని బాలాజీ జిల్లాలో చేర్చాలి’ అని విన్నవించారు. మరోవైపు రాజంపేట, రైల్వేకోడూరులో సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు జరిగాయి.
హిందూపురంలో సంతకాల సేకరణ
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా గుర్తించాలని సోమవారం అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో లేపాక్షిలో సంతకాల సేకరణ చేపట్టారు. మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
‘పల్నాడు’కు జాషువా పేరు పెట్టండి
వినుకొండ, గురజాల, నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని గుంటూరు జిల్లా వినుకొండ వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కోరారు. ఈమేరకు వినుకొండలోని కవికోకిల విగ్రహం వద్ద కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఇదే విషయమై తెదేపా నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. పల్నాడు జిల్లాకు గురజాలను కేంద్రం చేయాలని వివిధ పార్టీల నాయకులు సోమవారం గుంటూరు జిల్లా గురజాలలో ప్రదర్శన చేశారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందచేశారు.
మార్కాపురంలో భారీ ప్రదర్శన
మార్కాపురం పట్టణం, కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: అన్ని రంగాల్లో అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతాన్ని జిల్లాగా చేయాలంటూ సోమవారం విద్యార్థులు, స్థానికులు భారీ ర్యాలీ నిర్వహించారు. మరోవైపు కందుకూరు రెవెన్యూ డివిజన్‌ను నెల్లూరు జిల్లాలో కలపొద్దంటూ ఉలవపాడు మండలం కరేడుకు చెందిన యాదవ ఐకాస జిల్లా అధ్యక్షుడు మిరియం శ్రీనివాసులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.