ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రబాబు అడ్డగింత..వెల్లువెత్తిన నిరసనలు

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో వైకాపా నేతల ఆగడాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

TDP_NIRASANA
TDP_NIRASANA

By

Published : Mar 1, 2021, 3:23 PM IST

Updated : Mar 1, 2021, 8:15 PM IST

రేణిగుంట విమానాశ్రయంలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడును అడ్డుకోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో వైకాపా నేతల అరాచకాలు మితిమీరిపోతున్నాయని నిరసనకారులు మండిపడ్డారు.

చంద్రబాబు అడ్డగింతను నిరసిస్తూ నిరసన

శ్రీకాకుళం జిల్లాలో...

రాష్ట్రంలో రౌడీ, రాక్షస పరిపాలన సాగుతోందని తెదేపా నేత కూన రవికుమార్‌ మండిపడ్డారు. జిల్లా తెదేపా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెదేపా అధినేత చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం జగన్మోహన్‌రెడ్డి ఫ్యాక్షన్‌ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.

విజయనగరం జిల్లాలో...

వైకాపాపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను చూసి ఆ పార్టీ నేతలు భయపడుతున్నారని విజయనగరం పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జున విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తుందా? లేక రాజరిక పాలన నడుస్తోందా? అని ప్రశ్నించారు. పార్వతీపురంలోని రెడ్డివీధి కూడలిలో ఎమ్మెల్సీ జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆధ్వర్యంలో తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. చంద్రబాబు నాయుడు నిర్బంధాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో...

చంద్రబాబునాయుడును చిత్తూరు పర్యటనకు వెళ్లనీయకుండా రేణిగుంట విమానాశ్రయంలో అడ్డుకోవడంపై తుని లో తెదేపా శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అమలాపురం లో తెలుగుదేశం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడును నిర్బంధించి వైకాపా ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనంద రావు అన్నారు. ప్రత్తిపాడులో అంబేడ్కర్ విగ్రహం వద్ద తెదేపా నేతలు నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతరేకంగా నినాదాలు చేశారు. రాజోలు మండలం తాటిపాక గ్రామంలో మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు నివాసం వద్ద పార్టీ నేతలు నిరసన చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు లేవని ఆక్షేపించారు.

పశ్చిమగోదావరి జిల్లాలో...

నిడదవోలులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పట్టణ ప్రధాన రహదారుల్లో ధర్నా చేసి ప్రభుత్వ చర్యలను దుయ్యబట్టారు. ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని అడ్డుకోవడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని మాజీ శాసనసభ్యులు బురుగుపల్లి శేషారావు అన్నారు.

విజయవాడలో...

చంద్రబాబు నాయుడును అడ్డుకోవటాన్ని వ్యతిరేకిస్తూ... పార్టీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్ వద్ద నేతలు ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్, ఎమ్మెల్సీలు టీడీ జనార్దన్, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఇతర నేతలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. తెదేపా అధినేత అరెస్టును ఖండిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కైకలూరులో మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ నిరసన కార్యక్రమం చేపట్టారు. కైకలూరు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడం పిరికి చర్యగా అభివర్ణించారు.

నెల్లూరు జిల్లాలో...

రేణిగుంట విమానాశ్రయంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నిర్బంధాన్ని నిరసిస్తూ నెల్లూరులో తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో వైకాపా అరాచకాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కర్నూలు జిల్లాలో...

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ను రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకోవటాన్ని నిరసిస్తూ... కర్నూలులో తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. గాయత్రీ ఎస్టేట్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వైకాపా నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, కర్నూలు తెదేపా పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

చిత్తూరు జిల్లాలో...

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రేణిగుంట విమానాశ్రయంలో అడ్డుకోవడం అప్రజాస్వామికమని తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి, తితిదే పాలక మండలి మాజీ సభ్యుడు డొక్కా జగన్నాథం అన్నారు. తమ నాయకుడిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ... పుత్తూరు అంబేడ్కర్ కూడలి వద్ద తెదేపా శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. ట్రాఫిక్​కు అంతరాయం కలగడంతో నిరసన కారులను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక తెదేపా నాయకుల జోక్యంతో ఆందోళనకారులను విడుదల చేశారు. తెదేపా జిల్లా ముఖ్య నేతలను గృహనిర్బంధం చేయడంతో తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో తనపల్లి క్రాస్ వద్ద ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్వేటినగరం, శ్రీరంగరాజపురం మండలాల్లో తెలుగుదేశంపార్టీ నేతలు చిత్తూరు-పుత్తూరు ప్రధాన రహదారిపై బైఠాయించారు. వైకాపా నిరంకుశ పాలనలో ప్రజాస్వామ్యానికి రక్షణ లేకుండా పోయిందని నినాదాలు చేశారు.

కడప జిల్లాలో...

ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడును విమానాశ్రయంలో అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లేనని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడును రేణిగుంట విమానాశ్రయంలో అడ్డుకోవడం దారుణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్థన్ రెడ్డి హరిప్రసాద్ ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ కడప అంబేడ్కర్ విగ్రహం ఎదుట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబునాయుడును చూస్తుంటే వైకాపా నేతలకు వణుకు పుడుతోందని ఆయన ఆరోపించారు.

అనంతపురం జిల్లాలో...

కదిరిలో తెలుగుదేశం పార్టీ నేతలు రాస్తారోకో చేపట్టారు. చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబునాయడును రేణిగుంట విమానాశ్రయంలో నిర్బంధించడాన్ని ఖండిస్తూ ఇందిరాగాంధీ కూడలిలో జాతీయ రహదారిపై భైఠాయించారు. పెనుకొండ ఎన్టీఆర్ కూడలిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. తెదేపా నేతల అక్రమ అరెస్టులు ఆపాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులను అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అడ్డగింతను నిరసిస్తూ హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం వద్ద తెదేపా నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ తన మొండి వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ముగిసిన దక్షిణ భారత న్యాయవాదుల క్రికెట్‌ టోర్నమెంట్​

Last Updated : Mar 1, 2021, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details