ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభివృద్ధి నచ్చి..కేంద్రం మెచ్చి..పురస్కారాలు అందించింది

పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అన్నారు మహాత్మాగాంధీ. గ్రామాలు ప్రగతి పథంలో పయనించినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తుంది. ఇప్పటికీ గ్రామీణ ప్రజలు మౌలిక వసతులు కల్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు మొర పెట్టుకుంటూనే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో అసంపూర్తి పల్లె రహదారులు గ్రామస్థులకు అవస్థలు తెచ్చిపెడుతున్నాయి. స్వచ్ఛత, వ్యర్థాల నిర్వహణలో కొన్ని ఊళ్లు వెనుకబడే ఉన్నాయి. దీనికి భిన్నంగా కొన్ని గ్రామాల్లో వీధివీధికి సీసీ రోడ్లు.. అవసరాలకు సరిపడా నీటి వసతితో ఇతర పల్లెలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. పల్లె పాలకుల కృషికి మెచ్చి.. కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేసి.. ఏటా ఏప్రిల్‌ 24న పురస్కారాలను ప్రదానం చేస్తోంది. జిల్లాలోని మూడు గ్రామాలు అభివృద్ధి సాధించి పురస్కారాలు అందుకున్నాయి.

Central Govt Award Villege
అభివృద్ధి నచ్చి..కేంద్రం మెచ్చి..పురస్కారాలు అందించింది

By

Published : Feb 4, 2021, 6:42 PM IST


చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని రాష్ట్రంలోనే మొదటిసారిగా చిత్తూరు జిల్లా వి.కోట మేజర్‌ పంచాయతీలో ఏర్పాటు చేశారు. గృహాల నుంచి సేకరించిన చెత్తతో ఎరువులు తయారుచేసి.. అన్నదాతలకు విక్రయించారు. ఫలితంగా పంచాయతీకి అదనపు ఆదాయం సమకూరింది. ఘన వ్యర్థాల నిర్వహణను కూడా ఓ యజ్ఞంలా చేపట్టింది. ఇదే పంచాయతీనే గత ప్రభుత్వం భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించి పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. 21 కిలోమీటర్ల మేర నిర్మించాలని ప్రణాళికలు రూపొందించగా.. 18 కి.మీ పూర్తయింది. దీంతో పంచాయతీలో దోమల బెడద.. జ్వరాల బారిన పడే వారి సంఖ్యా తగ్గింది. స్వచ్ఛత, వ్యర్థాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు కల్పించడంతో 2016-17లో ఈ పంచాయతీకి దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తికరణ్‌ పురస్కారం వరించింది. 2018లో దివంగత మాజీ సర్పంచి రామక్రిష్ణప్ప అప్పటి కేంద్రమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆయన మూడుసార్లు సర్పంచిగా వ్యవహరించారు.


సర్పంచులకు పాఠమైంది..
పెనుమూరు మండలంలోని లక్కలపూడివాండ్లఊరు సాధించిన విజయాలు దేశంలోని ఇతర పంచాయతీ సర్పంచులకు పాఠాలయ్యాయి. అయిదేళ్ల కాలంలో పంచాయతీలో వీధివీధికి సీసీ రహదారులు, తాగునీటి సౌకర్యం, ఆరోగ్య కేంద్రం నిర్మాణం వంటి పనులను చేపట్టారు. 2.65 కోట్ల రూపాయలతో కలికిరి కొండకు మలుపుల వద్ద సీసీ, సాధారణ ప్రాంతంలో తారు రహదారి కూడా వేశారు. ఇందుకోసం అప్పటి సర్పంచి నారా శాంతి కేంద్ర మంత్రులను కలసి.. విన్నవించారు. మొత్తంగా రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. ఈ అభివృద్ధిని మెచ్చి.. 2015-16 సంవత్సరానికి కేంద్రం ఉత్తమ పంచాయతీ పురస్కారాన్ని ప్రకటించింది. గ్రామ అభివృద్ధిని ఓ డాక్యుమెంటరీగా రూపొందించి సర్పంచులకు ఓ నమూనాగా ప్రదర్శిస్తున్నారు.

2 నెలలు.. రూ.80 లక్షలతో రోడ్ల నిర్మాణం
కార్వేటినగరం మేజర్‌ పంచాయతీలో ఎనిమిదేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాను కింద అభివృద్ధి పనులకు నిధులు కేటాయించింది. ఆ సమయంలో ఎస్టీ మహిళ అమరావతి సర్పంచిగా ఉన్నారు. రెండు నెలల్లో ఎస్టీ కాలనీల్లో 80 లక్షల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టారు. పారిశుద్ధ్యం అంశంపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. గతంతో పోలిస్తే మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 2013- 14 సంవత్సరానికి పల్లెను ఉత్తమ పంచాయతీగా ఎంపిక చేసింది. అనంతరం స్వచ్ఛతలో కూడా పంచాయతీ పురస్కారాన్ని కైవసం చేసుకుంది.

పోలవరం రోడ్డు నుంచి కలికిరివాండ్ల ఊరుకు నిర్మించిన సిమెంటు రోడ్డు

ఇదీ చదవండీ..జోరుగా.. రెండో విడత కోవిడ్ వ్యాక్సినేషన్

ABOUT THE AUTHOR

...view details