చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో లాక్ డౌన్ సడలింపులు అమలు చేశారు. కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో కంటైన్మెంట్ జోన్ లో మినహా మిగిలిన ప్రాంతాల్లో లాక్ డౌన్ ను అధికారులు సడలించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్ లు అందుబాటులో ఉంచారు. ప్రజలంతా స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటించాలని సూచించారు.
కరోనా కేసులు నమోదైన నగాచి పాలెం, హిమామ్ వీధి, పెండ్లి మండపం కూడలి వంటి జోన్లో ఎలాంటి సడలింపులు లేకపోవటంతో ప్రజలంతా ఇంటికే పరిమితం కావాలని పురపాలక సంఘ కమిషనర్ శ్రీకాంత్, డీఎస్పీ నాగేంద్రుడు కోరారు. ఎప్పటిలాగే కంటైన్మెంట్ జోన్ లోని ప్రజలకు ఇంటి వద్దకే నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. పాల సంఘం ఆధ్వర్యంలో ఇంటింటికీ పట్టణంలో పాలు సరఫరా చేయనున్నట్లు పాల సంఘం అధ్యక్షుడు మునిరాజ తెలిపారు.