అధికార, ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైన వైనం బయటపడుతోంది. భూ ఆక్రమణలు అరికట్టేందుకు రెవెన్యూ అధికారులు కదులుతుండటంతో...లక్షల రూపాయలు వెచ్చించి ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన సామాన్య ప్రజలు నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి..
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో రూ.400 కోట్ల విలువైన భూ ఆక్రమణలు జరిగాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి ఇటీవల చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి అండదండలతో ఈ అక్రమాలు జరిగాయని గ్రామాల వారీగా సర్వే నంబర్లతో సహా ఆయన బయటపెట్టారు. దీనిపై అధికార పార్టీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా స్పందిస్తూ ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. గతంలో సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు హయాంలో కిషోర్‌కుమార్‌రెడ్డి ప్రోద్బలంతో జరిగిన అక్రమాల దగ్గర నుంచి నేటి వరకు భూ ఆక్రమణలపై విచారణకు చేపట్టాలని కోరారు.
రెవెన్యూ సిబ్బంది హస్తంపై కూడా ఆయన ప్రస్తావించడంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. మదనపల్లె సబ్ కలెక్టరు జాహ్నవి పీలేరు పరిసరాల్లో ఆక్రమిత భూములను పరిశీలించడంతో పాటు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్- చెన్నై, తిరుపతి-మదనపల్లె జాతీయ రహదారికి పక్కనున్న దొడ్డిపల్లె, ఎర్రగుంటపల్లె, బోడుమల్లువారిపల్లె, గూడురేవుపల్లె, ముడుపులవేముల గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో వేసిన అక్రమ లేఔట్లను ధ్వంసం చేయడంతో పాటు స్వాధీనం చేసుకుంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఎర్రగుంట్లపల్లెలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఏర్పాటు చేసిన లేఔట్‌లో గురువారం రాత్రి నేరేడు మొక్కలు నాటారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు రెవెన్యూ సిబ్బందిపై చర్యలు కూడా తీసుకున్నారు.
భూ ఆక్రమణల్లో అధికార పార్టీ నేతలు వారి తప్పులు కప్పి పుచ్చుకొనేందుకు...తమపై ఆరోపణలు చేస్తున్నారు. విచారణ కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ రాయటం అంతా నాటకమని...ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా స్థానిక రెవెన్యూ అధికారులతో సర్వే చేయిస్తే ఆక్రమణలు బయటపడతాయి. డీకేటీ భూములను ఆక్రమించి ఇళ్లస్థలాలకు విక్రయించిన నేతలు...రూటు మార్చి వ్యవసాయ భూములుగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారు. రాత్రికిరాత్రే పండ్ల మొక్కలు నాటుతున్నారు. ఇప్పటివరకు 10 శాతం భూములను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవాలి. రెండేళ్లుగా ఆక్రమణలు జరుగుతున్నా పట్టించుకోలేదు. అక్రమాలు మేము వెలుగులోకి తెచ్చాక మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో అన్ని కుంభకోణాలు త్వరలోనే బయటపెడతాం. మా హయాంలో అక్రమాలు జరిగి ఉంటే చర్యలు తీసుకోవచ్చు. ఎలాంటి అభ్యంతరం లేదు.
- నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి, తెదేపా