ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికార పార్టీ ఆగడాలపై ఫిర్యాదు చేస్తే.. బాధితుడినే బంధించిన పోలీసులు

తన స్థలంలో వైసీపీ బ్యానర్లు కడుతున్నారంటూ సమాచారమిచ్చిన తెలుగు యువత నాయకుడు, న్యాయవాదిని ఏకంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని ఎక్కడికి తీసుకెళుతున్నామన్న సమాచారాన్నీ కుటుంబీకులకు తెలుపలేదు.

victim is the hostage
న్యాయవాది నవీన్‌ యాదవ్‌

By

Published : Dec 26, 2022, 1:35 PM IST

Updated : Dec 26, 2022, 1:44 PM IST

తన స్థలంలో వైసీపీ బ్యానర్లు కడుతున్నారంటూ సమాచారమిచ్చిన తెలుగు యువత నాయకుడు, న్యాయవాదిని ఏకంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని ఎక్కడికి తీసుకెళుతున్నామన్న సమాచారాన్నీ కుటుంబీకులకు తెలుపలేదు. చివరకు ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నడమిగడదేశి గ్రామానికి చెందిన తెలుగు యువత నాయకుడు, న్యాయవాది, బీసీ సామాజికవర్గానికి చెందిన నవీన్‌ యాదవ్‌తో పాటు ఆయన తండ్రి మునిరాజాను పోలీసులు స్టేషన్లకు తరలించారు. ఇది గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి పెద్దిరెడ్డి పల్లెబాట సందర్భంగా.. వైసీపీ శ్రేణులు తన స్థలంలో పార్టీ బ్యానర్లను ఏర్పాటుచేయడాన్ని నవీన్‌ ప్రశ్నించారు. దీంతో సుమారు 50 మందివరకు వైసీపీ కార్యకర్తలు ఆయన నివాసానికి వచ్చి వాగ్వాదానికి దిగారు. రాళ్లు, కర్రలతో ఇంటిపై దాడికి సిద్ధమయ్యారు. నవీన్‌ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి వివాదాన్ని సర్దిచెప్పకపోగా.. సమాచారమిచ్చిన నవీన్‌తోపాటు ఆయన తండ్రి మునిరాజాను వెంట తీసుకెళ్లారు.

నవీన్‌ను జిల్లాలోని ఓ స్టేషన్‌కు తరలించారు. మునిరాజాను పుంగనూరు స్టేషన్‌లో ఉంచారు. ఈ విషయాన్ని పోలీసులు కుటుంబీకులెవరికీ చెప్పలేదు. తన భర్తను ఫోన్‌లోనైనా మాట్లాడించాలని నవీన్‌ భార్య హరిత అభ్యర్థించినప్పటికీ పట్టించుకోలేదు. ఆమె ఫిర్యాదును స్వీకరించారు. తన భర్తకు, మామకు ప్రాణనష్టమైతే.. పీకేఎం ఉడా ఛైర్మన్‌ వెంకటరెడ్డియాదవ్‌, అధికార పార్టీ శ్రేణులే బాధ్యత వహించాలని ఆమె అన్నారు. హరితకు మద్దతుగా టీడీపీ వర్గీయులు పుంగనూరు స్టేషన్‌ ఎదుట వర్షంలో బైఠాయించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. చివరకు నవీన్‌ను సొంత పూచీకత్తుపై పలమనేరు స్టేషన్‌ నుంచి పంపించారు. ఆయన తండ్రినీ విడుదల చేశారు. గ్రామంలో రోడ్డు వేసే విషయమై వివాదమేర్పడిందని మరోవైపు వైసీపీ నేతలు ఆరోపించారు. యాదవులు, బీసీలు, టీడీపీ మద్దతుదారులపై వైసీపీ దౌర్జన్యాలు పెరిగాయని నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆరోపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి, వైసీపీ వర్గీయుల ఆగడాలు పెరుగుతున్నాయని పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్‌ విమర్శించారు.

మంత్రి అరాచకాలను ప్రశ్నిస్తున్నారనే: నారా లోకేశ్‌

మంత్రి పెద్దిరెడ్డి అవినీతి, అరాచకాలను ప్రశ్నిస్తున్నారనే నవీన్‌, ఆయన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ‘పోలీసుల అదుపులో ఉన్న తండ్రీకొడుకులకు ఏం జరిగినా మంత్రి పెద్దిరెడ్డి, పోలీసులే బాధ్యత వహించాలి’ అని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 26, 2022, 1:44 PM IST

ABOUT THE AUTHOR

...view details