పీలేరు పోరులో... సైకిలో జోరా? ఫ్యాను హోరా? చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో ఈ సార్వత్రిక ఎన్నికలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రచారంలో 2 ప్రధాన పార్టీలు తెదేపా, వైకాపా నువ్వా... నేనా అన్నట్లు దూసుకెళ్తున్నాయి. తమ అభ్యర్థి గెలుపు కోసం... ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు తెలుగు తమ్ముళ్లు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం చేస్తామంటూ... విస్తృత ప్రచారం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో పరస్పరం పోటీపడిన జై సమక్యాంధ్ర పార్టీ, తెదేపా.. ఇప్పుడు ఒకే వేదిక పంచుకోవడంతో... శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం సాగిస్తున్నాయి. నవరత్నాలే ఆయుధంగా...
నియోజకవర్గంలో వైకాపాకూ స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. పార్టీ అధినేత జగన్ ప్రకటించిన నవరత్నాలను నమ్ముకొని ఆ పార్టీ కార్యకర్తలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. 2 లక్షల 15 వేల ఓట్లున్న పీలేరులో... ముస్లిం మైనారిటీ ఓట్లు అధికంగా ఉన్నాయి. పీలేరు, వాల్మీకిపురం, కలకడ మండలాల్లో దాదాపు 40 వేల మైనారిటీ ఓటర్లున్నారు. ఈ కారణంతో.. 2 పార్టీల నేతలు ప్రత్యేక దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో భాజపాతో పొత్తు నేపథ్యంలో దూరమైన ముస్లిం ఓట్లు... ఈసారి తమకే పడతాయని తెదేపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నల్లారి గెలుపు ఎత్తులు
2014లో జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి బరిలో నిలిచిన నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి 37 వేల ఓట్లు సాధించారు. తెదేపా అభ్యర్థి ఇక్బాల్ 34 వేల ఓట్లు దక్కించుకున్నారు. వైకాపా అభ్యర్థి చింతల 71 వేల ఓట్లు సాధించి... 34 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో రెండో స్థానంతో సరిపెట్టుకొన్న నల్లారి తనకు ఇప్పటికే ఉన్న బలానికి తోడు.. ఈ సారి తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారణంగా.. విజయబావుటా ఎగరేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తెదేపా హయాంలో ఆశించిన అభివృద్ధి జరగలేదని ప్రచారం చేస్తున్న వైకాపా అభ్యర్థి రామచంద్రారెడ్డి.. మరోసారి విజయంపై ధీమాగా ఉన్నారు. భాజపాతో లోపాయికారి ఒప్పందం ఉందన్న ప్రత్యర్థి తెదేపా ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు వ్యూహాత్మకంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ముస్లింల ఓట్లు చీలకుండా... గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత కలిసొస్తుందని విశ్వాసంతో ఉన్నారు. జగన్‌కు అవకాశం ఇవ్వాలన్న ప్రజాభిప్రాయం ముందు ఎలాంటి సమీకరణాలు పనిచేయవని... తన గెలుపు తథ్యమని వైకాపా అభ్యర్థి చింతల అంటున్నారు.
జనసేన ప్రభావం ఎంత?
గత ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గంలో వైకాపా, తెదేపా, జై సమైక్యాంధ్ర పార్టీల మధ్య పోరు నడవగా... ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, జనసేన పార్టీలూ బరిలో ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి మైనారిటీ నేత ఖాజామొయిద్దీన్ పోటీలో ఉన్న కారణంగా... ముస్లింల ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. మరో వైపు జనసేన నుంచి కాపు సామాజికవర్గ నేత దినేష్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సామాజిక వర్గాల వారీగా ఓట్ల చీలికలు... అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.