తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో జరిగిన సంఘటనలపై ప్రిసైడింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్ల ద్వారా నివేదికలు తెప్పించామని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేవీఎన్ చక్రధర్‌బాబు వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ నివేదికను పంపామన్నారు.
‘వివిధ పార్టీల అభ్యర్థులు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించాం. రికార్డు పరంగా తుది నివేదిక తయారు చేశాం. ఎన్నికల పరిశీలకులు 50 పోలింగ్ కేంద్రాల్లో వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏడు నియోజకవర్గాల్లో వివాదాస్పద పోలింగ్ కేంద్రాలను పరిశీలించి.. ఆ విశ్లేషణను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాం...’ అని ఆయన వివరించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్‌ను రెండు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని, పెద్ద హాళ్లల్లో పది టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.