NATIONAL KABBADI: తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి మహిళలు, పురుషుల కబడ్డీ పోటీలు ముగిశాయి. కబడ్డీ పోటీల ముగింపు వేడుక ఉత్సాహంగా జరిగింది. ముగింపు కార్యక్రమానికి తెలుగు ఒలింపియన్, దిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం ఉపకులపతి కరణం మల్లీశ్వరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. విజేతలైన జట్లకు గోల్డ్ కప్, నగదు బహుమతి ప్రదానం చేశారు. క్రీడల్లో ప్రతిభ పాటవాలు ప్రదర్శించి యువత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కరణం మల్లీశ్వరి ఆకాంక్షించారు.
కొవిడ్ కారణంగా రెండేళ్ల నుంచి క్రీడాకారులు ఎంతో నష్టపోయారన్న ఆమె.. ఆ లోటు తీరుస్తూ తిరుపతిలో కబడ్డీ పోటీలు నిర్వహించడం హర్షణీయమన్నారు. తిరుపతిలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం తెలుగు వారందరికీ గర్వకారణమని.. ముగింపు వేడుకల్లో పాల్గొన్న నేతలు అన్నారు. ఇలాంటి క్రీడలను మరెన్నో రాష్ట్రంలో నిర్వహించాలని..ఇందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హమీ ఇచ్చారు.