ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జంట హత్యల కేసు: నిందితులు తిరుపతి రుయాకు తరలింపు

క్షుద్రపూజలు చేసి కన్నబిడ్డలను దారుణంగా హత్యచేసిన.. మదనపల్లె జంట హత్యల కేసు నిందితులను తిరుపతికి తరలించారు. ఇరువురు మానసిక సమస్యలతో బాధపడుతుండటంతో... వైద్యుల సూచన, కోర్టు ఆదేశాల మేరకు రుయా ఆసుపత్రిలోని సైకియాట్రీ విభాగానికి తరలించారు.

By

Published : Jan 29, 2021, 7:34 AM IST

madanapalle twin murder accused
నిందితులను రుయాకు తరలింపు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్యల కేసు నిందితులను... తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మూఢనమ్మకాలతో ఇద్దరు కుమార్తెలను హతమార్చిన పద్మజ, పురుషోత్తంలకు మానసిక సమస్యలు ఉన్నాయి. దీంతో నిందితులను తిరుపతిలోని రుయా సైకియాట్రీ విభాగంలో చికిత్స అందించాలని సూచించటంతో.. వారిని తరలించారు.

'అందరితో కలిపి నన్నూ ఉంచండి'

అందరితో కలిపి నన్నూ మహిళా బ్యారక్‌లోనే ఉంచండి’ అంటూ కన్నబిడ్డలను హతమార్చిన కేసులో నిందితురాలు పద్మజ చిత్తూరు జిల్లా మదనపల్లె స్పెషల్‌ సబ్‌ జైలు అధికారులను కోరినట్టు తెలిసింది. ఈ వినతి మేరకు.. ఆమెను ఇతర మహిళా నిందితులతో కలిపి ఉంచినట్లు సమాచారం.

మీకెలాంటి ఇబ్బందులు కలిగించనంటూ పద్మజ తోటి ఖైదీలతో అన్నట్లు తెలుస్తోంది. అందరితో కలిసి భోజనం చేసిందని.. రాత్రంతా శివనామస్మరణలో గడపడం మినహా ఎవరితోనూ మాట్లాడలేదని జైలు సూపరింటెండెంట్‌ రామకృష్ణయాదవ్‌ తెలిపారు. గురువారం సాయంత్రం ప్రత్యేక బ్యారక్‌కు మార్చి, అదనంగా సిబ్బందిని నియమించారు. పద్మజ భర్త పురుషోత్తంనాయుడు ప్రవర్తన సాధారణంగానే ఉంది.

కుమార్తెలు అలేఖ్య (27), సాయిదివ్య(22)లను క్షుద్రపూజల పేరుతో హతమార్చిన ఈ దంపతులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించాలని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మానసిక వైద్యురాలు రాధిక ఇచ్చిన నివేదిక మేరకు జైలువర్గాలు అనుమతి కోసం కోర్టును ఆశ్రయించాయి. కోర్టు అనుమతులు రావటంతో.. నిందితులను రుయాకు తరలించారు.

పోలీసుల అదుపులో మాంత్రికుడు
యువతుల హత్య జరగడానికి ముందురోజు ఉదయం శివనగర్‌లోని నిందితుల ఇంటికి వచ్చిన మాంత్రికుడు సుబ్బరామయ్యను పోలీసులు విచారిస్తున్నారు. పురుషోత్తంనాయుడి ఇంటికి వచ్చినప్పుడు తాను చూసిన పరిస్థితులను మాంత్రికుడు పోలీసులకు వివరించాడు. ‘ఈనెల 23న నేను తాయెత్తులు, రుద్రాక్షలు కట్టడానికి పురుషోత్తం ఇంటికి రాగా.. అప్పటికే అక్కడ 40-50 ఏళ్ల వయసున్న మరో బక్కపల్చటి వ్యక్తి ఉన్నాడు. స్పృహలో లేని అలేఖ్య చెవిలో శంఖం ఊదుతున్నాడు’ అంటూ మరో వ్యక్తి వివరాలు అందించాడు. జంట హత్యల తర్వాత ఘటనాస్థలికి చేరుకున్న వ్యక్తుల నుంచి కూడా పోలీసులు వాంగ్మూలాలు తీసుకుంటున్నారు.

ఇదీ చదవండి:జంట హత్యల కేసులో పోలీసుల సమన్వయ లోపం... నిందితుల తరలింపు ఆలస్యం

ABOUT THE AUTHOR

...view details