ఈ ఏడాది వర్షాలు అనుకూలంగా కురుస్తున్నాయి. ఖరీఫ్ సీజన్లో వర్షాధారంపై సాగు చేయడానికి రైతులు ఉత్సాహం చూపుతున్నా.. కాడెద్దులు, వ్యవసాయ పనిముట్లు సమకూర్చుకునే పరిస్థితిలో లేరు. ట్రాక్టర్ల అద్దెలు, కూలీల ఖర్చులు, వ్యవసాయ పనిముట్ల ధరలు భరించలేని రైతులకు వారి.. కుటుంబీకులే అనేక రూపాల్లో వ్యవసాయం పనుల్లో కాడి మేడి పట్టి కాడెద్దులై కదులుతున్నారు.
ట్రాక్టర్లతో దుక్కులు చేయించుకుని విత్తనాలు, కలుపు, ఇతర పనుల్లో రైతులే అన్నీ తామై పని చేసుకుంటున్నారు. కరోనా మహమ్మారి కాటుకు పట్టణాలు వదిలేసి పొలాలకు చేరిన రైతులు.. వారి పిల్లలు ప్రత్యామ్నాయంగా వ్యవసాయాన్ని నమ్ముకుంటున్నారు. ఈ పరిస్థితిలో వేరే పనులు లేక వ్యవసాయ రంగంలోనే చెమటోడ్చి పని చేస్తున్నారు.