ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 11, 2021, 11:20 AM IST

ETV Bharat / state

KATHI MAHESH : విమర్శకుడు "కత్తి"... నటుడెలా అయ్యాడంటే....?

గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కత్తి మహేశ్‌ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అసలు కత్తి మహేశ్‌ సినిమాల్లోకి ఎలా వచ్చారు? సినీ విశ్లేషకుడిగా ఎలా మరారు? బిగ్‌బాస్‌ అవకాశం ఎలా వచ్చింది? అసలు ఆయన నేపథ్యం ఏంటి?

katti mahesh
కత్తి మహేశ్‌

సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్‌ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. అసలు కత్తి మహేశ్‌ సినిమాల్లోకి ఎలా వచ్చారు? సినీ విశ్లేషకుడిగా ఎలా మరారు? బిగ్‌బాస్‌ అవకాశం ఎలా వచ్చింది? అసలు ఆయన నేపథ్యం ఏంటి?

కత్తి మహేశ్‌ పుట్టి పెరిగిన జిల్లా..

కత్తి మహేశ్‌ చిత్తూరు జిల్లా పీలేరులో పుట్టి పెరిగారు. తండ్రి వ్యవసాయశాఖలో అధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. మహేశ్‌కు ఒక అన్న, ఒక చెల్లి ఉన్నారు. చిన్నప్పటి నుంచి మహేశ్‌కు సినిమాలంటే అమిత ఆసక్తి. వేసవి సెలవులు వస్తే చాలు, రోజూ సినిమాకు వెళ్లేవారట. ఎవరైనా ‘సినిమా బాగోలేదు’ అని చెబితే, అసలు ఎందుకు బాగోలేదో తెలుసుకునేందుకు ఆ సినిమా చూసేవారట. మైసూర్‌ రీజినల్‌ కాలేజ్‌లో ఇంగ్లీష్ లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో మాస్‌ కమ్యూనికేషన్‌ చదివారు..

సినిమాలపై ఆసక్తి..

సినిమాలపై ఆసక్తితో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ప్రొడక్షన్‌ హౌస్‌లో ‘రాఘవేంద్ర మహత్య్మం’ సీరియల్‌కు పనిచేశారు. వర ముళ్లపూడి వద్ద 10 ఎపిసోడ్‌లకు సహాయకుడిగా పని చేసిన తర్వాత డబ్బులు సరిపోకపోవడంతో చిత్తూరు వెళ్లిపోయి ఓ ఎన్జీవోలో చేరారు. ఆ తర్వాత యూనిసెఫ్‌, వరల్డ్‌ బ్యాంకు, సేవ్‌ ది చిల్ర్డన్‌ తదితర సంస్థల్లో పనిచేశారు.

అనురాగ్‌ కశ్యప్‌ చెప్పిన మాటలకు స్ఫూర్తి పొంది సినిమా చేయాలని మళ్లీ ఇండస్ట్రీవైపు అడుగులు వేశారు. అందులో భాగంగానే స్నేహితులతో కలిసి ‘నవతరంగం‌’ అనే వెబ్‌సైట్‌ ప్రారంభించారు. తెలుగు ఇండిపెండెంట్‌ సినిమా అనే ఫేస్‌బుక్‌ గ్రూప్‌ మొదలు పెట్టారు. కన్నడలో ‘లూసియా’ అనే సినిమాను క్రౌండ్‌ ఫండింగ్‌ ద్వారా చేయటంతో ఆ ఆలోచనతోనే ఇండిపెండెంట్‌ మూవీ చేయాలనుకున్నారు. సాహిత్యం నుంచి కథను తీసుకుని చేస్తే ఎలా ఉంటుందున్న ఆలోచనతో బాలగంగాధర తిలక్‌ ‘ఊరి చివర ఇల్లు’ను స్క్రిప్ట్‌గా రాసుకున్నారు. అందరికీ ఆ స్క్రిప్ట్‌ నచ్చడంతో షార్ట్‌ఫిల్మ్‌ను మహేశ్‌నే తీయమన్నారు. అలా తొలిసారి మెగాఫోన్‌ పట్టారు.

కత్తి మహేశ్‌ది ప్రేమ వివాహం..

కత్తి మహేశ్‌ది ప్రేమ వివాహం. ఆమె బెంగాలీ. యూనిసెఫ్‌కు పనిచేస్తున్న సమయంలో కేర్‌ ఇండియా సంస్థ తరపున కత్తి మహేశ్‌ సతీమణి పనిచేసేవారు. జాతీయ స్థాయి వర్క్‌షాప్‌లో వీరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా, ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. మహేశ్‌కు ఒక కుమారుడు.

బిగ్‌బాస్‌లో అవకాశం కూడా కత్తి మహేశ్‌కు అనుకోకుండా వచ్చిందే. స్టార్‌ మా నుంచి కాల్‌ రాగానే ఏదైనా సినిమా కోసం ఏమో అనుకున్నారట. కానీ, బిగ్‌బాస్‌ కోసం అని చెప్పడంతో ఆశ్చర్యపోయారట. అలా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లిన ఆయన దాదాపు నాలుగు వారాల పాటు ప్రేక్షకులను అలరించారు. వ్యాఖ్యాత తారక్‌ తనని ఎంతగానో ప్రోత్సహించారని కత్తి మహేశ్‌ పలు సందర్భాల్లో చెప్పారు. బిగ్‌బాస్‌కు ముందు చాలా తక్కువ మందికే తాను తెలుసని, ఆ తర్వాత కొన్ని కోట్ల మందికి తెలిశానని, తనకు వచ్చిన గుర్తింపునకు కారణం ‘బిగ్‌బాస్‌’ షోనేనని మహేశ్‌ చెప్పేవారు. మొదటి వారంలో వెళ్లిపోతానని అనుకున్న తాను నాలుగు వారాలు ఉండటం నిజంగా గ్రేట్‌ అనేవారు.

అనుకోకుండా అలా నటుడయ్యారు...

ఇక నటుడిని అవుతానని తాను ఎప్పుడూ అనుకోలేదని చెప్పేవారు. ‘నిజానికి నటుడు అవ్వాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. సాయి రాజేశ్‌ నాకు స్నేహితుడు. చిన్న బడ్జెట్‌లో ‘హృదయ కాలేయం’ తీస్తున్నానని నాతో చెప్పాడు. పెద్ద నటులతో చేసేంత బడ్జెట్‌ లేదని, మీకు సరిపోయే పాత్ర ఒకటి ఉంది చేస్తారా? ‘మీరు మీలా ఉంటే చాలు’ అని అడిగారు. నేను, రచయిత దర్శకుడు కావడంతో సంభాషణలు, హావభావాలు పలకడం సులభమైంది. అంతేకానీ, నేను గొప్ప నటుడిని కాదు. హిందీలో సౌరభ్‌శుక్లా గొప్ప నటుడు. నాకూ ఆయనకు పోలికలు ఉంటాయి. కేవలం రూపంలో మాత్రమే’’ అని ఓ సందర్భంలో చెప్పారు మహేశ్‌.

‘కొబ్బరిమట్ట’లో నగర బహిష్కరణ సన్నివేశం ఉంది. దానికి థియేటర్‌లో మంచి స్పందన వచ్చింది. అయితే ఆ సీన్‌ తీయాలనుకున్నప్పుడు తాను నిజంగా హైదరాబాద్ నగర బహిష్కరణలోనే ఉన్నారట. అందుకే సినిమాలో దాన్ని అలా వాడుకున్నారట. పైగా అది జనాలకు బాగా నచ్చడంతో థియేటర్‌లో మంచి స్పందన వచ్చింది. తనబాడీ లాంగ్వేజ్‌కు తగ్గ పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాననేవారు కత్తి మహేశ్‌. ఆ క్రమంలో నటుడిగా ఎదిగితే కొనసాగుతానని, అది దర్శక-రచయితల చేతుల్లో ఉందని అనేవారు. ఎప్పటికైనా మంచి సందేశాత్మక చిత్రం తీయాలని కత్తి మహేశ్‌ అనుకునేవారు. అలాంటిది రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడం అందరినీ కలచివేసింది. యావత్‌ సినీ పరిశ్రమ ఆయనకు నివాళి అర్పిస్తోంది.

ఇదీ చదవండి:Chittoor: నేడు యర్రావారి పాలెంలో కత్తి మహేశ్​ అంత్యక్రియలు

ABOUT THE AUTHOR

...view details