ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సైనేడ్​తో భార్యను చంపిన బ్యాంకు మేనేజర్ - మదనపల్లెలో టాబ్లెట్ లో సైనెడ్ నింపిన భర్త న్యూస్

హత్య చేయాలనుకుంటే పథకాలు బోలెడు. అందులోనూ.. ఇంతవరకు ఎక్కడా చూడని.. ఎవరికీ తెలియని విధానంలో చంపేస్తున్నారు తెలివైన దుర్మార్గులు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో అసలు ఊహించడానికే.. అవకాశంలేని రీతిలో ఓ హత్య జరిగింది. అదనపు కట్నం కోసం... భార్యను ఓ ప్రబుద్ధుడు ఏ మాత్రం అనుమానం రాకుండా చంపేశాడు. పైగా.. తప్పించుకునేందుకు చేసిన తతంగం అంతా.. ఇంతా.. కాదు.

husband murdered wife with cyanide in chittor
husband murdered wife with cyanide in chittor

By

Published : Feb 3, 2020, 1:43 PM IST

Updated : Feb 4, 2020, 9:38 AM IST

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అనుకున్నాడేమో.. భార్యను చంపేందుకు పక్కా ప్లాన్ వేశాడు. తెలివిగా వ్యవహరించాడు. కానీ ప్రతి నేరస్థుడు ఏదో ఒకచోట దొరికిపోతాడుగా.. అలా.. పోలీసుల చేతికి చిక్కాడు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో బ్యాంకు మేనేజర్‌ రవిచైతన్య.. ఆయన భార్య నివాసం ఉండేవారు. గత నెల 27న రవి భార్య ఆమని మృతి చెందింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

పోస్టుమార్టం వద్దు!
ఆమని మృతి చెందిన రోజు.. భర్త రవి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. తన భార్య బాత్‌రూంలో పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకొచ్చానని మార్గమధ్యంలో ఆమె మృతి చెందిందని వైద్యులకు తెలియజేశారు. అనుమానం వచ్చిన వైద్యులు మృతదేహాన్ని శవపరీక్షకు తరలించే ప్రయత్నం చేశారు. తమకు ఎలాంటి అనుమానాలు లేవని మృతదేహాన్ని ఇచ్చేస్తే తీసుకెళ్లిపోతానని రవిచైతన్య వైద్యులతో అన్నారు. పోలీసులు అనుమతిస్తే తీసుకెళ్లాలని ఆసుపత్రి సిబ్బంది సూచించారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రవిచైతన్య ప్రయత్నించారు. దీనికి పోలీసులు ఒప్పుకోలేదు. ఆమని మృతి చెందిన విషయం తెలుసుకున్న కృష్ణాజిల్లాకు చెందిన ఆమె తండ్రి నాగేంద్రరావు తన కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సైనేడ్‌ వల్ల్లే...
అల్లుడు రవిచైతన్యకు వివాహ సమయంలో రూ.15లక్షల కట్నం, 150 తులాల బంగారం, ఎకరా పొలం ఇచ్చామని చెప్పారు నాగేంద్రరావు. ఇంకా అదనపు కట్నం కావాలని వేధింపులకు గురి చేస్తుండటంతో మరో ఎకరం పొలం ఇస్తామని చెప్పామని... ఇంతలోనే తన కుమార్తె మృతి చెందిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టంలో మృతురాలు సైనేడ్‌ తినడం వల్ల మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రవిచైతన్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తుండగా.. విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి.

మాత్రలో సైనేడ్..
రవిచైతన్య భార్య ఆమని చెల్లెలుకు విలువైన రెండు ఎకరాల పొలాన్ని కట్నంగా ఇచ్చి తల్లిదండ్రులు వివాహం చేశారు. విషయం తెలిసిన రవిచైతన్య తనకు ఒక ఎకరమే ఇచ్చి మోసం చేశారని.. మరో ఎకరం కావాలని భార్యను వేధించడం మొదలుపెట్టారు. అతని తల్లిదండ్రులు త్రినాథుడు, విజయభారతి సైతం వేధించారు. పైగా రవికి వివాహేతర సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే.. భార్యను ఎలాగైనా వదిలించుకోవాలని పథకం వేశాడు. ఆమె రోజూ వేసుకునే మాత్ర(మెడిసిన్) ట్యూబ్‌ను విప్పి అందులోని రసాయనాన్ని పారబోసి సైనేడ్‌ను అందులో నింపారు. సైనేడ్ మింగిన ఆమని మృతి చెందింది.

పోలీసుల విచారణ..
భార్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తే ఎక్కడ నిజం బయట పడుతుందోనని భయపడి పోస్టుమార్టం వద్దని వైద్యులపై ఒత్తిడి తెచ్చాడు రవి. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో రవిచైతన్య అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి విచారణ చేయగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడు సైనెడ్‌ను ఎక్కడినుంచి తీసుకువచ్చాడో విచారిస్తున్నామని.. సైనేడ్‌ తెచ్చి ఇచ్చిన వారిపైనా చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఇదీ చదవండి: నా వల్లే చనిపోయాడు.. నేనూ ఉండలేను!

Last Updated : Feb 4, 2020, 9:38 AM IST

ABOUT THE AUTHOR

...view details