జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో చిత్తూరు జిల్లాలోని పలు చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో నామినేషన్ కేంద్రాల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. పలుచోట్ల తెలుగుదేశం అభ్యర్థుల నుంచి వైకాపా నేతలు నామినేషన్ పత్రాలు లాక్కొడం, దాడులకు పాల్పడటం జరిగింది. వందలాది మంది వైకాపా కార్యకర్తలు నామినేషన్లు వేసే క్యూలైన్ వరుసల్లో నిల్చుని మిగిలిన అభ్యర్థులకు సమయం మించిపోయే వరకు చోటివ్వలేదు. క్యూలైన్‌లో ఉన్నవారి చేతుల్లో నామపత్రాలు లాక్కుని పారిపోయారు.
2 డివిజన్‌లో ఓ అభ్యర్థిని రెండురోజుల పాటు నామినేషన్ వేసేందుకు ప్రయత్నించినా వైకాపా శ్రేణులు అడ్డుకున్నాయి. కొన్నిచోట్ల భయపెట్టి పోటీలో ఎవరూ లేకుండా ఏకగ్రీవం చేసుకున్నారు. వైకాపా మేయర్ అభ్యర్థికి పోటీలో ఉన్న తెలుగుదేశం అభ్యర్థిని భర్తను అపహరించుకుపోయారు. పోలీసుల సమక్షంలోనే పలువురు తెలుగుదేశం అభ్యర్థులపై దాడులకు పాల్పడ్డారు. 16వ వార్డులో నామినేషన్ దాఖలుకు వచ్చిన తెదేపా అభ్యర్థి శ్రీకాంత్‌ను అధికార పార్టీ నేతలు విచక్షణారహితంగా కొట్టటంతో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది... వారికి అండగా నిలిచేందుకు అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఎదుటే దౌర్జన్యానికి దిగారు. జిల్లావ్యాప్తంగా జరిగిన ఘటనలపై సుగుణమ్మ ఎన్నికల అబ్జర్వర్ సిద్ధార్ధ్ జైన్‌కు ఫిర్యాదు చేశారు.