కోర్టు ధిక్కరణ కేసులో విచారణకు గైర్హాజరైన చిత్తూరు జిల్లా ఎంఆర్ పల్లి ఎస్సై ఎస్. నరేంద్ర మరో ఏడుగురు పోలీసు కానిస్టేబుళ్లు హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సంబంధిత పోలీసులు సెప్టెంబర్ 1న తమ ముందు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. గంగారావు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. సీఐడీ వి.ఎస్. వెంకటేశ్ నాయక్, ఆయన భార్య శారదాబాయ్పై ఎంఆర్‌పల్లి పోలీసులు 2019 ఆగస్టు 25న నమోదు చేసిన కేసులో అరెస్ట్‌తో పాటు తదుపరి చర్యలను నిలువరిస్తూ అదే ఏడాది డిసెంబర్ 20 హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ పోలీసులు వారిని అరెస్ట్ చేయడంతో పాటు దర్యాప్తు నిర్వహించి సంబంధిత కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. దీంతో వెంకటేశ్ నాయక్ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. న్యాయస్థానం ఇచ్చిన స్టే ఉత్తర్వులకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని పిటిషనర్ న్యాయవాది వెంకటరమణ వాదించారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి గత విచారణలో పోలీసుల హాజరుకు ఫాం-1 నోటీసు జారీ చేశారు. తాజాగా జరిగిన విచారణకు ఇన్స్పెక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి, ఎస్సై నరేంద్రతో పాటు మిగిలిన కానిస్టేబుళ్లు గైర్హాజరయ్యారు. ఇన్స్పెక్టర్ పి. సురేంద్రనాథ్ రెడ్డికి గతంలో పంపిన ఫాం-1 నోటీసు వెనక్కి తిరిగి వచ్చింది. తదుపరి విచారణకు ఎస్సై నరేంద్ర ఇతర పోలీసులతో పాటు ఇన్స్పెక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి సైతం కోర్టుకు హాజరవుతారని పీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీంతో ఇన్స్పెక్టర్ మినహా మిలిగిన పోలీసులకు న్యాయమూర్తి బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.