ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూత.. తెదేపా నేతల సంతాపం - Satyaprabha is no more news

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూశారు. చికిత్స పొందుతూ.. బెంగళూరు వైదేహి అసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఇటీవలే తెదేపా జాతీయ ఉపాధ్యక్షురాలుగా రెండోసారి ఎన్నికయ్యారు.

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూత
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూత

By

Published : Nov 20, 2020, 12:16 AM IST

Updated : Nov 20, 2020, 8:31 PM IST

మాజీఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూత

తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ బెంగళూరు వైదేహి అసుపత్రిలో ఆమె తుది శ్వాస విడిచారు. తెదేపా జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.సత్యప్రభ మృతిపట్ల చంద్రబాబు సంతాపం తెలిపారు. సత్యప్రభ మృతి పార్టీకి తీరనిలోటన్నారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సత్యప్రభ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.

తెదేపాలో సత్యముద్ర...

చిత్తూరు జిల్లాలో బలమైన సామాజిక వర్గ నేపథ్యం.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆదికేశవులనాయుడి సతీమణి డీఏ సత్యప్రభ(71) గురువారం రాత్రి మరణించారు. బెంగళూరులోని వైదేహి ఆస్పత్రిలో కనుమూసిన ఆమె.. తెలుగుదేశం పార్టీ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.. ఆదికేశవులనాయుడి భార్యగా రాజకీయ ఆరంగేట్రం చేసిన ఆమె అనతికాలంలోనే పార్టీలో కీలక పదవులు నిర్వర్తించారు.. అజాత శత్రువుగా పేరొందారు. చిత్తూరు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి తమకంటూ ఓ సుస్థిర స్థానాన్ని పదిలం చేసుకున్నారు.

డీకే ఆదికేశవుల నాయుడి కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన ఎంపీగా నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. శ్రీనివాస ట్రస్టు ఏర్పాటు చేసి సేవలను జిల్లావ్యాప్తంగా విస్తృతం చేశారు. తాగునీటి పథకాలు.. అభివృద్ధి పనులు.. చెరువుల అభివృద్ధి.. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.

ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించి ఆనంద నిలయానికి స్వర్ణ తాపడం చేయించేందుకు అవిరళ కృషి చేశారు. ఆయన 2013 ఏప్రిల్‌ 24న మరణించారు. దీంతో ఆయన సతీమణి సత్యప్రభ తెరపైకొచ్చారు. అప్పటివరకు కాంగ్రెస్‌లో ఉన్న ఆ కుటుంబం రాష్ట్ర విభజన సమయాన రాజకీయాలకు దూరంగా ఉంది. ఆపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి పిలుపు మేరకు ఆ కుటుంబం పార్టీ తీర్థం పుచ్చుకుంది. 2014 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థినిగా చిత్తూరు శాసనసభ స్థానానికి సత్యప్రభ బరిలోకి దిగారు. అప్పటి వరకు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆరణి శ్రీనివాసులకు టికెట్‌ ఖాయం అనుకుంటున్న తరుణంలో రాజకీయాలు అనూహ్యంగా మలుపులు తిరిగి ఆమె భారీ మెజార్టీతో గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టారు. జిల్లా నుంచి ఆ సమయంలో ఎమ్మెల్యేగా గెలిచిన ముగ్గురు మహిళల్లో ఆమె ఒకరు.

అభివృద్ధికి కృషి:

అయిదేళ్లలో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారు. నగరంలో ఉన్న చెరువులను అన్నింటినీ ఆమె స్వయంగా చొరవ చూపి అభివృద్ధి చేశారు. స్వయంగా నాటి సీఎం చంద్రబాబుతో మాట్లాడి నిధులు తీసుకొచ్చి రహదారులు, చెరువులు, పార్కులు.. ఇలా పలు అభివృద్ధి పనులు చేపట్టారు. నియోజకవర్గంలోని గుడిపాలలో పాఠశాలల అభివృద్ధికి తనవంతు సహకరించారు. నగరంలోని సంతపేట రహదారి, గాంధీ కూడలి.. సువిశాలంగా తీర్చిదిద్దడంలో ఆమె పాత్ర కీలకం. రాజకీయాల్లో ఆమె చూపిన చొరవను గుర్తించిన అధినేత చంద్రబాబు.. ఆమెను పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. అటు పార్టీ.. ఇటు నియోజకవర్గంలో సమన్వయం చేసుకుంటూ సత్యప్రభ ముందుకు సాగిన తీరు అందరి ప్రశంసలు అందుకున్నారు.

మరోవైపున..:

2019 సార్వత్రిక ఎన్నికల సమయాన.. ఆమె సేవలను వినియోగించుకోవాలని పార్టీ అధిష్ఠానం భావించి రాజంపేట పార్లమెంటు స్థానానికి పోటీ చేయించి ప్రత్యర్థుల ముందు బలమైన అభ్యర్థినిని తెదేపా నిలిపింది. విధేయతకు గుర్తింపుగా రెండోసారి చంద్రబాబు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. పీయూసీ వరకు అభ్యసించిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్దకుమార్తె తేజశ్వరి, చిన్నకుమార్తె కల్పజ, కొడుకు శ్రీనివాస్‌ సైతం పారిశ్రామికవేత్తలే. ఈ కుటుంబానికి విద్యా సంస్థలు, పరిశ్రమలు, పలు రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నాయి.

బెంగళూరులోనే అంత్యక్రియలు..

సత్యప్రభ అంత్యక్రియలు బెంగళూరుకు గురువారం అర్ధరాత్రి తరలించారు. ఇవాళ ఉదయం మళ్లీ వైట్‌ఫీల్డ్‌లోని వైదేహి వైద్యకళాశాల ఆవరణకు తీసుకువచ్చారు. అక్కడ పార్టీ నేతలు, ప్రముఖులు, ఇతర ప్రజాప్రతినిధుల నివాళులు అర్పించారు. శుక్రవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చదవండీ... ఎట్టిపరిస్థితుల్లోనూ స్థానిక ఎన్నికలను అనుమతించకూడదు!

Last Updated : Nov 20, 2020, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details