తిరుమలేశుడిని దర్శించుకునేందుకు తీసుకొచ్చిన సిఫార్సు లేఖలను తితిదే తిరస్కరించడంపై సోమవారం ఉదయం తిరుమలలో భక్తులు కొద్దిసేపు ఆందోళన చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన భక్తులు తమ ప్రాంత ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వచ్చారు. జేఈవో కార్యాలయం వద్దకు రాగా సిబ్బంది వాటిని తీసుకోలేదు. భక్తులు ఆందోళనకు దిగిన విషయం తెలుసుకున్న అదనపు ఈవో ధర్మారెడ్డి.. వెంటనే వాటిని తీసుకుని టికెట్లు జారీ చేయాల్సిందిగా ఆదేశించారు.
ఈ నెల 25న వైంకుఠ ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉన్నందున సిఫార్సు లేఖలను పరిమితంగా అనుమతించినట్లు తితిదే చెబుతోంది. మరోవైపు...లాక్‌డౌన్ సడలింపు అనంతరం తొలిసారిగా ఆదివారం 40,721 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమల భక్తజన సందోహంగా మారిపోయింది. హుండీ ఆదాయం రూ.3.13 కోట్లు వచ్చింది.