చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రెడ్ జోన్లు మినహా అన్నీ ప్రాంతాల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచారు. గుంపులు గుంపులుగా మద్యం కోసం గుమిగూడిన వారిని చెదరగొట్టడానికి అధికారులు నానా తంటాలు పడ్డారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించని కారణంగా పరిసర ప్రాంత ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
పడమటి మండలాల్లో మద్యం షాపుల వద్ద ప్రజలు బారులు తీరారు. తంబళ్లపల్లి పోలీసులు, ములకలచెరువు ఎక్సైజ్ అధికారులు తప్పనిసరిగా గొడుగు, మాస్క్ ఉండాల్సిందేనని నిబంధన విధించగా.. వాటితోనే జనాలు వచ్చారు. విపరీతమైన ఎండను భరించిన మద్యం ప్రియులు తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మద్యం షాపుల వద్ద ఎదురు చూశారు.
కర్ణాటక ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లోని ఇరు రాష్ట్రాల తరఫున మద్యం దుకాణాలు తెరుచుకోగా.. దుకాణాల వద్ద బారులు తీరి మద్యాన్ని కొనుగోలు చేశారు. కొన్ని చోట్ల మందు బాబులు 20 నుంచి 30 మద్యం సీసాలను కొనుక్కున్నారు. కుప్పం నియోజకవర్గంలో చాలాచోట్ల మందుబాబులు ద్విచక్ర వాహనాలపైనే కాక.. కాలినడకన వెళ్లి మద్యాన్ని కొనుగోలు చేశారు.