చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో ప్రమాదాలు - నేరాలు జరిగాయి.
లారీ చోదకుల వద్ద నగదు దోపిడీ
గంగవరం మండలం బైపాస్ రోడ్డుపై గురువారం రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చెన్నై నుండి బెంగళూరుకు వెళ్తున్న రెండు లారీలను అటకాయించి డ్రైవర్ లను కొట్టి నగదు దోచుకెళ్లారు. చెన్నై ఫాక్స్ కాన్ కంపెనీ నుండి బెంగళూరుకు మొబైల్ విడి భాగాలు తీసుకువెళ్తున్న లారీల డ్రైవర్ ల వద్ద రూ.7500 నగదు దోచుకెళ్లారు. డ్రైవర్ల ఫిర్యాదు మేరకు గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భారీగా గుట్కా స్వాధీనం
బైరెడ్డిపల్లె పోలీసులు శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. బైరెడ్డిపల్లె వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్ట్ వద్ద వి.కోట వైపు నుంచి వస్తున్న బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా అందులో కూరగాయల అడుగున తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లు పోలీసులు గుర్తించారు. వాహనంతో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గుట్కా విలువ రూ. లక్షా పదహారు వేలు ఉంటుందని బైరెడ్డిపల్లె ఎస్సై మునస్వామి తెలిపారు.
టెంపో బోల్తా
పలమనేరు మండలం నాగమంగళం ఫ్లై ఓవర్ వద్ద శుక్రవారం కర్ణాటక రాష్ట్రం కోలార్ నుంచి చెన్నైకి టమాటా లోడుతో వెళ్తున్న టెంపో బోల్తా పడింది. ముందు టైరు పంచర్ అయి ఈ ప్రమాదం జరిగింది. టెంపో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. పలమనేరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి :నిబంధనలు గాలికి.... పాఠశాల ప్రాంగణంలో కొవిడ్ పరీక్షలు