* కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాలపల్లికి చెందిన గువ్వల హనుమంతు ఎకరా భూమిలో మిరప నాటారు. వైరస్ ఆశించి మొక్కలు చనిపోయాయి. మళ్లీ నాటినా నిలవలేదు. రూ.70 వేల పెట్టుబడి అయింది. మరో మూడెకరాల్లో సాగు చేసిన పత్తి గట్టెక్కిస్తుందనుకుంటే.. వర్షాల్లేక ఎకరాకు రెండు క్వింటాళ్ల లోపే వచ్చింది. తెచ్చిన అప్పు తీర్చేందుకు.. లక్షకు కొన్న ఎడ్ల జతను రూ.50 వేలకు అమ్మేసి.. భార్యతో కలిసి మహబూబ్‌నగర్ జిల్లాకు వలస వెళ్లి పత్తి ఏరుకుంటున్నారు.
* గుంటూరు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడుకు చెందిన కావూరు పిచ్చయ్య ఎకరన్నరలో మిరప వేస్తే.. పెట్టుబడి రూ.75 వేలు అయింది. వైరస్ సోకడంతో పైరు పీకేశారు. ఈ గ్రామంలో 90% పైరు తెగులుతో దెబ్బతింది. ‘మళ్లీ మిరప వేద్దామనుకున్నా.. పెట్టుబడి తట్టుకోలేక మానుకున్నాను. అందుకే కంది వేశా’ అని వివరించారు.
chilli farmers problems: జెమిని వైరస్ ఒకవైపు.. తామర పురుగు మరోవైపు మిరపను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షాలూ తోడై రైతును నట్టేట ముంచేస్తున్నాయి. ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.70 వేలకు పైగా పెట్టుబడి పెట్టాక పంటను తొలగించే పరిస్థితి కల్పిస్తున్నాయి. ఈ ఏడాది ఎదురైన గడ్డు పరిస్థితులు మునుపెన్నడూ లేవని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుగు, తెగుళ్ల నివారణకు కొందరు వారానికి నాలుగైదుసార్లు రసాయన మందులు పిచికారీ చేస్తున్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో.. ఒకటికి రెండుసార్లు మొక్కలు కొని తెచ్చి నాటుతున్నారు. అయినా ఫలితం లేక వేలాది ఎకరాల్లో మొక్కల్ని తొలగిస్తున్నారు. వీటిని తట్టుకుని పంటను కాపాడుకున్నా.. అధిక వానలతో మొక్కలు ఉరకెత్తి చనిపోతున్నాయి. గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఈ పరిస్థితి అధికంగా కన్పిస్తోంది. అనంతపురం, కృష్ణా జిల్లాలోనూ తెగుళ్ల ప్రభావం ఉంది. వైరస్ తట్టుకునే రకాలంటూ.. కొందరు వ్యాపారులు నల్లబజారులో అధిక ధరలకు విత్తనాలు అంటగట్టారు. వీటికీ వైరస్ సోకి నష్టపోయామని గుంటూరు జిల్లా పెదకూరపాడు ప్రాంత రైతులు వాపోతున్నారు.
రికార్డు స్థాయిలో సాగు
గతేడాది ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 4.59 లక్షల ఎకరాల్లో మిరప వేశారు. నిరుటి కంటే ఇది 1.11 లక్షల ఎకరాలు ఎక్కువ. గుంటూరు జిల్లాలో 2.41 లక్షలు, ప్రకాశంలో 94 వేలు, కర్నూలు 56 వేలు, కృష్ణా జిల్లాలో 35వేల ఎకరాల్లో మిరప సాగవుతోంది.