ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదిగో తిరుమల ...ఇదిగో అలిపిరి! - alipiri place history

తిరుమల పాదాల చెంత ఉన్న అలిపిరికి... ఆ పేరు ఎలా వచ్చిందనే దానిపై భిన్న కథనాలున్నాయి. ఆ పేరు రావటానికి గల కారణాలు ఏమిటో మీరు కూడా తెలుసుకోండి.

alipiri
అలిపిరి

By

Published : Feb 18, 2021, 10:18 AM IST

కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువుదీరిన తిరుమల పాదాల చెంతనున్న దివ్య ప్రదేశం అలిపిరి. తిరుమల కొండపైకి వెళ్లేందుకు మార్గం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. అలిపిరి అనే పేరు ఎలా వచ్చిందనే దానిపై భిన్న కథనాలున్నాయి. తమిళులు కొండ దిగువభాగాన్ని ‘అడివారం’ అంటారు. మొదటిమెట్టును ‘అడిపడి’ అంటారు. ఈ పేర్లే కాలక్రమంలో అలిపిరిగా మారాయని చెబుతారు. వైష్ణవంలో చింతచెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తిరుమలలో స్వామివారు చింతచెట్టు కిందే వెలిసినట్లు చెబుతారు. నమ్మాళ్వారు చింతచెట్టు తొర్రలో చాలాకాలం గడిపారు. పూర్వం తిరుమల గిరుల పాద భాగంలో పులి అనే చింతచెట్టు ఉండడం వల్ల అడిపులి అనే పేరు ఏర్పడింది. అది కాలక్రమంలో అలిపిరి అయిందని అంటారు.


పూర్వం తిరుమల కొండ ఎక్కలేనివారు కపిల తీర్థంలోని ఆళ్వారు తీర్థం దగ్గర తలనీలాలు సమర్పించి, అక్కడే స్నానం చేసి అలిపిరి పాదాలవద్ద నుంచే స్వామికి నమస్కరించి వెళ్లేవారు. కొండ ఎక్కేందుకు అనుమతి లేనివారు కూడా ఇలాగే చేసేవారు. అప్పటి నుంచి అలిపిరిలో సాష్టాంగ నమస్కారాలు చేయడం ఆనవాయితీ అయింది.
* సాలగ్రామ శిలామయమైన తిరుమల కొండను పాదాలతో తొక్కకూడదని రామానుజాచార్యులవారు చాలాకాలం పాటు అలిపిరి నుంచే స్వామివారిని సేవించుకునేవారు. తర్వాత కాలంలో ఆయన మోకాళ్లపై తిరుమలకు వెళ్లినట్లు చరిత్రలో ఉంది.
* ఇక్కడి స్వామివారి పాదాలు స్వయంభువుగా చెబుతారు రామానుజాచార్యుల వారు తిరుపతికి వచ్చి ఏడాది పాటు గోవిందరాజ స్వామివారి సన్నిధిలో ఉండి రోజూ అలిపిరికి వచ్చేవారు. అదే సమయానికి తిరుమలలో స్వామివారి కైంకర్యాలు ముగించుకున్న తిరుమల నంబి కొండదిగి అలిపిరి చేరకుని చింత చెట్టు కింద కూర్చుని రామానుజులవారికి రామాయణ రహస్యాలు బోధించి తిరిగి మధ్యాహ్నం కైంకర్యాల సమయానికి తిరుమల చేరుకునేవారు. ఒకరోజు మధ్యాహ్నం కైంకర్యాల సమయం దాటిపోయింది. పూజకు ఆలస్యమైందని తిరుమల నంబి బాధపడుతూ ఉన్న సమయంలో ఎదురుగా స్వామివారి పాదాలు ప్రత్యక్షమయ్యాయి. ఆయన వాటిని సేవించి తరించారు.
* పూర్వం అలిపిరి ప్రాంతంలో కుండలు చేసుకుని జీవించే భీముడు అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన చెక్కతో చేసిన స్వామి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించుకుని పూజిస్తుండేవాడు. ఆయన భక్తికి మెచ్చి వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యాడు. భీముడు స్వామివారికి నైవేద్యాన్ని మట్టిమూకుడులో సమర్పించాడు. ఆ భక్తుని చిరస్మరణీయం చేసేందుకు స్వామివారు స్వయంగా సగం పగిలిన కుండలోనే నివేదన సమర్పించే ఆచారం ఏర్పరిచారు. తర్వాత కాలంలో భీముడే కురవతి నంబిగా ప్రసిద్ధిపొందాడు.

ఇదీ చదవండి:రేపు తిరుమలలో రథసప్తమి వేడుకలు

ABOUT THE AUTHOR

...view details