Missing Woman Came Home: చిత్తూరు జిల్లాలో అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. 25 ఏళ్ల క్రితం తప్పిపోయిన మహిళ.. ఇన్నాళ్లకు తన ఇంటిని చేరుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఉబ్బి తబ్బిపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం ప్రకారం.. జిల్లాలోని శాంతిపురం మండలం రాళ్లబూదుగూరులో మునియప్ప, కన్నమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. వారిలో కుమార్తె పద్మమ్మ పెద్దది. పద్మమ్మ ఆ దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె కావడంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఆమెను సుమారు 30 ఏళ్ల కిందట కర్ణాటక పరిధిలోని కీరమంద గ్రామంలో వెంకటేష్‌కు ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. వారి దాంపత్య జీవితం ఎంతో ఆనందంగా సాగింది. వారికి ఇద్దరు కుమారులు.
అయితే కొన్నాళ్లకు పద్మమ్మ మతిస్థిమితం సరిగా లేక ఎక్కడికో వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె కోసం పలు చోట్ల గాలించినా ఫలితం లేకపోయింది. 25 సంవత్సరాలుగా ఆమె ఆచూకీ లభించలేదు. ఒక్కగానొక్క కుమార్తె పద్మమ్మ తప్పిపోవటంతో ఆమె తల్లి కన్నమ్మ బెంగపెట్టుకుని.. 20 ఏళ్లు వేదన అనుభవించి.. నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించింది. కాగా.. పద్మమ్మ విజయవాడలో ఉన్నట్లు ఐదు రోజుల కిందట ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. విజయవాడలో లక్ష్మి అనే మహిళ సంరక్షణలో ఉన్న పద్మమ్మకు ఓ ప్రమాదంలో తలకు గాయం అయింది.
దీంతో ఆమెను చికిత్స మేరకు సమీపంలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె ఆరోగ్యం కుదుటపడి గతం గుర్తుకు వచ్చింది. దీంతో తన తల్లిదండ్రుల పేర్లు, స్వస్థలం తదితర వివరాలను హాస్పిటల్ సిబ్బంది, సంరక్షకురాలికి పద్మమ్మ చెప్పింది. వెంటనే వారు అక్కడి వార్డు సచివాలయ సిబ్బంది సాహకారంతో రాళ్లబూదుగూరు గ్రామ సచివాలయ సంక్షేమ కార్యదర్శికి విషయాన్ని తెలిపారు. స్థానిక ఏఎన్‌ఎం హైమావతి అక్కడికి ఇంటికి వెళ్లి రూఢీ చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులను విజయవాడకు పంపించారు.