మీరు రాలేదు.. మీరే రమ్మనలేదు!
ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యకలాపాలు మొదలైన రెండో రోజే... అధికార - ప్రతిపక్షాల మధ్య కీచులాట మొదలైంది. ఏపీ శాసనసభలో మర్యాదలు పాటింపుపై సంవాదం జరిగింది.
శాసనసభలో సభాపతికి గౌరవం ఇచ్చే విషయంపై.. అధికార వైకాపా ప్రతిపక్ష తెదేపా మధ్య మాటలు నడిచాయి. స్పీకర్గా సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదటిసారి ఆశీనులయ్యే సమయంలో.. సభాపతిని తోడ్కొని వెళ్లే విషయంలో కనీసం... ప్రతిపక్ష నేతను ఆహ్వానించలేదని.. తెదేపా సభ్యుడు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ ఎన్నికకు తమను పిలిస్తే బాగుండేదని అచ్చెన్నాయుడు అన్నారు. ఈ పరిణామం.. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య చర్చకు దారితీసింది. ఆ తర్వాత.. చీఫ్ విప్ శ్రీకాంతరెడ్డి, అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబే స్పీకర్ను అభినందించడానికి రాలేదని ఆక్షేపించారు. ఇందుకు.. చంద్రబాబు స్పందిస్తూ అసలు స్పీకర్ ఎన్నిక విషయమే తమకు మాటమాత్రం కూడా చెప్పలేదని సమాధానం ఇచ్చారు. తెదేపా అధికారంలో ఉన్న ప్రతి సందర్భంలోనూ.. స్పీకర్ ఎన్నిక విషయంలో సమాచారం ఇచ్చామని ప్రతిపక్షనేత చంద్రబాబు అన్నారు. కిందటి సభలో స్పీకర్గా కోడెలను ఎన్నుకున్నప్పుడు.. మంత్రులను జగన్ వద్దకు పంపించానని గుర్తు చేశారు. అయితే సభా మర్యాదలను తెదేపా ఎప్పుడూ పాటించలేదని శ్రీకాంతరెడ్డి ఆరోపించారు. కిందటి సభలో స్పీకర్ ఎన్నిక విషయం తమకు చెప్పలేదన్నారు. గతంలో కోడెల ఎన్నిక విషయంలో తమను పిలవ లేదన్ని వైకాపా మాటలను తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కొట్టిపారేశారు. కోడెల ఎన్నిక సమయంలో జగన్ ఏం మాట్లాడారనేది కేశవ్ చదివి వినిపించారు.