రాజకీయం... ఏముంటుంది.. ఉన్న పార్టీలే... మహా అయితే కొత్త పార్టీ. రోజు చూసే కథే కదా! నాయకుడు... ప్రతినాయకుడు ఉన్న వారే.. కొత్తగా చూడటానికి... చెప్పుకోవటానికి ఏంలేదులే.. అంటుంటారు చాలా మంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల లెక్క మారుతోంది. పెద్దల స్థానంలో యువసైన్యం పాగా వేస్తోంది. అధికార తెలుగుదేశంలో పార్టీలోని చాలా మంది సీనియర్ నేతలు పోటీకి దూరంగా ఉంటూ...తమ వారసుల అరంగేట్రానికి పచ్చజెండా ఊపారు. ఇప్పటికే పలువురు యువకెరటాలు టికెట్ దక్కించుకోగా... మరికొందరి విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. రసవత్తరంగా సాగుతున్న ఈ బిగ్‌ఫైట్‌లో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.
రాజకీయ అడ్డాలోనూ..!
నారా లోకేష్....ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న విషయం తీవ్ర ఉత్కంఠకు రేపింది. 2009 సంవత్సరంలో తెదేపాలో భాగస్వామిగా మారిన లోకేశ్...పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉంటూ కేడర్‌లో జోష్ నింపుతూ వచ్చారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఆయన పార్టీ పొలిట్ బ్యూరోలో సభ్యుడిగా అవకాశం దక్కింది. తర్వాత ఎమ్మెల్సీగా..మంత్రిగా బాధ్యతలు చేపట్టి పార్టీలో కీలక నేతగా ఎదిగారు. కిందటి ఎన్నికల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసిన లోకేష్ ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపలేదు. ఈసారి మాత్రం ఆయన పోటీ ఆసక్తి రేకెత్తించింది. మొదటగా భీమిలి నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపించినా... చివరగా రాజధాని ప్రాంతమైనమంగళగిరి నుంచి బరిలో నిలవబోతున్నారు.
రాష్ట్ర రాజకీయాలకు అడ్డా అయినా కృష్ణా జిల్లా ఎన్నికల రణరంగంలోకి కాలుమోపారు యువనేత దేవినేని అవినాష్. ఒకప్పుడు కృష్ణా జిల్లా రాజకీయాలకు కొత్త కోణం చూపిన దేవినేని నెహ్రూకుమారుడీయన. ఇప్పుడు గుడివాడ నుంచి పోటీ చేస్తుండటం.. రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే తన మాటాల తూటాలతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారీ తెలుగు యువకెరటం.విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రస్తుత శాసనసభ్యుడు జలీల్ ఖాన్ కూతురు షబానా ఖాతున్ టికెట్ దక్కించుకున్నారు.
బ్యాలెట్ పోరుకు సిద్ధమైన మరో యువ నేత పరిటాల శ్రీరామ్. ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న దివంగత పరిటాల రవి కుమారుడే ఈయన... తల్లి సునీత మంత్రి. ఇన్ని భారీ అంచనాల మధ్య అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం నుంచి శ్రీరామ్ పోటీకిదిగుతుండటం...జిల్లా వ్యాప్తంగా...వేడి పుట్టిస్తోంది.
అత్యధికంగా అక్కడి నుంచే...!
రాయలసీమ రాజకీయాల్లో మరో బలమైన నేతగా ఉన్న రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్ రాజకీయారంగేట్రానికి సిద్ధమయ్యారు. అనంత రాజకీయాల్లో మరో యువ కిరణాలు ఎన్నికల బరిలోకి దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి అనంత ఎంపీగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతుండగా.. జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు ఆస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు.