నిన్న ఐఏఎస్‌లు... నేడో, రేపో ఐపీఎస్‌లు!
భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం... ప్రస్తుతం ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధం చేసింది. నేడో, రేపో పోలీసుల బదిలీ ఉత్తర్వులు వెలువడనున్నట్టు తెలుస్తోంది. పోలీసు ప్రధాన కార్యలయం మొదలుకుని జిల్లా ఎస్పీల వరకు స్థానంచలనం జరగనుంది.
కొత్త ప్రభుత్వం చకచకా అడుగులేస్తోంది. నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అనుగుణమైన టీంను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఎవరెవర్ని ఎక్కడెక్కడికి బదిలీ చేయాలన్న దానిపై సమగ్ర నివేదికను డీజీపీ గౌతం సవాంగ్ ముఖ్యమంత్రి జగన్‌కు ఇప్పటికే అందజేశారు. శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ, సీఐడీ విభాగాధిపతి, ప్రోవిజిన్స్ అండ్ లాజిస్టిక్ విభాగం అదనపు డీజీ, శాంతిభద్రతల విభాగం డీఐజీ తదితర స్థానాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. విజయవాడ, విశాఖ నగర కమిషనర్లనూ మార్చే అవకాశం ఉంది. విజయనగరం, చిత్తూరు, గుంటూరు గ్రామీణ, అనంతపురం, కృష్ణా, విశాఖ గ్రామీణ ఎస్పీలను వేరే పోస్టుల్లోకి మార్చనున్నట్లు సమాచారం. ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు అర్బన్ ఎస్పీలను వేరే జిల్లాలకు మార్చనున్నారు. రేంజి డీఐజీలుగా ఉన్నవారికి స్థానచలనం తప్పకపోవచ్చు. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన అనురాధ, రవాణాశాఖ కమిషనర్‌గా పనిచేసిన బాలసుబ్రమణ్యంను ఇప్పటికే బదిలీ చేయగా....వారికీ పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉంది.