ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యేలుగా గెలుపు...ఎమ్మెల్సీలకు రాజీనామాలు - ap

అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన పలువురు ఎమ్మెల్సీలు  మండలి సభ్యత్వాలకు రాజీనామా చేయనున్నారు.వీరిలో పయ్యావుల కేశవ్, కరణం బలరాం, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, కోలగట్ల వీరభద్రస్వామి ఉన్నారు. త్వరలోనే ఖాళీ అయినా స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి.

ఎమ్మెల్యేలుగా గెలుపు...ఎమ్మెల్సీలకు రాజీనామాలు

By

Published : Jun 1, 2019, 7:46 AM IST


రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ్యులుగా ఎన్నికైన పలువురు శాసన మండలి సభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. వైసీపీ, తెదేపాల నుంచి ఎన్నికైన నలుగురు ఎమ్మెల్యేలు త్వరలోనే తమ రాజీనామా లేఖల్ని సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు జరగటం తథ్యం కావటంతో అధికార పార్టీ సభ్యుల సంఖ్య మండలిలో 8 నుంచి 11కు పెరగనుంది.
రాజీనామాలు చేయాల్సిందే వీరే...
ఎమ్మెల్యేలుగా గెలుపొందిన శాసనమండలి సభ్యులు 15 రోజుల్లోగా తమ రాజీనామాలను సమర్పించాల్సి ఉంది. తెదేపా తరపున ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల నుంచి గెలుపొందిన మాగుంట శ్రీనివాసలరెడ్డి ఆ పదవికి రాజీనామా చేసి వైసీపీ తరపున ఒంగోలు లోక్​సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అలాగే అనంతపురం జిల్లా స్థానిక సంస్థల నుంచి తెదేపా తరపున ఎమ్మెల్సీగా గెలిచిన పయ్యావుల కేశవ్..ఉరవకొండ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఇక ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి వైకాపా తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ కూడా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న కోలగట్ల వీరభద్ర స్వామి విజయనగరం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించాల్సి ఉంది. ఎమ్మెల్యేల కోటాలో తెదేపా తరుపున ఎన్నికైన కరణం బలరామకృష్ణమూర్తి చీరాల శాసనసభ్యుడిగా గెలుపొందటంతో...ఆయన కూడా శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది.
ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఎమ్మెల్సీలు రాజీనామా చేయాల్సి ఉండటంతో శాసనమండలిలో 5 ఎమ్మెల్సీ పదవులకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఈ 5 ఎమ్మెల్సీల భర్తీకి జరిగే ఉప ఎన్నికల్లో విజయం సాధించే వారిలో ముగ్గురు 2023 వరకు కొనసాగుతారు. మరో ఇద్దరుసభ్యులు 2021వరకే ఆ పదవిలో ఉంటారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details