ఈ నెల 13న ఎమ్మెల్యేలంతా తనను సభాపతిగా ఎన్నుకుంటారని... ఆ పదవి చేపట్టబోతోన్న తమ్మినేని సీతారాం తెలిపారు. 12న శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయని... నూతన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి కుటుంబ సభ్యులతో వచ్చిన తమ్మినేని సీతారాం... తనను శాసన సభాపతి స్థానానికి ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. నిస్పక్షపాతంగా సభను నడుపుతానని తమ్మినేని పేర్కొన్నారు. గతంలో జరిగిన తప్పులు ఇకపై జరగబోవని అన్నారు.
పురపాలక శాఖ మంత్రిగా తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు సేవ చేస్తానని ఆ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. తెదేపా ప్రభుత్వంలో పురపాలక శాఖలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్న ఆయన... తమ హయాంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి కుటుంబంతోసహా వచ్చి సీఎంను కలిశారు. మంత్రి పదవి ఇచ్చినందుకు ధన్యావాదాలు తెలిపారు. సీఆర్డీఏపై ముఖ్యమంత్రి సమీక్ష చేసిన అనంతరం రాష్ట్ర అభివృద్ధి నిర్ణయం తీసుకుంటామని బొత్స తెలిపారు.