చంద్రబాబు నివాసానికి ఆనుకుని నిర్మించిన ప్రజావేదిక భవనం కూల్చివేసే ప్రక్రియను నిన్న సాయంత్రం అధికారులు మొదలుపెట్టారు. అయితే దీనిని తక్షణమే ఆపాలని ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త పి.శ్రీనివాసరావు హైకోర్టులో అత్యవసర వ్యాజ్యాన్ని వేశారు. హౌస్ మోషన్ పిటిషన్ను కోర్టు స్వీకరించగా.. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జామున 3.30 గంటల వరకు దీనిపై విచారణ కొనసాగింది. ప్రజావేదికను కూల్చివేస్తే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. అక్రమ కట్టడాల కూల్చివేతపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నాకే ముందుకెళ్లాలని .. ఈ వ్యవహారంపై శాసనసభలో చర్చించాలని కోరారు. ఏకపక్షంగా ప్రజావేదిక కూల్చివేతకు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకుండా ప్రభుత్వం ప్రజావేదికను కూల్చి వేయకూడదని కోర్టుకు తెలిపారు.
ప్రజావేదిక కూల్చివేతపై హైకోర్టు ఏమందంటే? - demolish
ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేయటంపై స్టే ఇవ్వాలని హైకోర్టులో శ్రీనివాసరావు అనే వ్యక్తి హౌస్ మోషన్ పిటిషన్ వేశారు .దీనిపై హైకోర్టు విచారణ జరిపి ప్రజావేదిక కూల్చివేతపై నిలుపదల చేసేందుకు నిరాకరించింది. కేసును రెండు వారాలకు వాయిదా వేసింది.
ప్రభుత్వ తరఫు అడ్వకేట్ జనరల్ వాదిస్తూ ప్రజావేదిక అక్రమకట్టడమని శ్రీనివాసరావు తన పిటిషన్లో పేర్కొన్నారని ..సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం అక్రమకట్టడాలను కూల్చివేయొచ్చన్నారు. పిటిషన్ వేసే సమయానికే ప్రజావేదికను కూల్చివేసే ప్రక్రియ ప్రారంభమైందని .ఉదయానికి పూర్తవుతుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజా ప్రయోజనాల పేరుతో కూల్చివేతను మధ్యలో నిలువరించటం సరికాదని వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం... ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనతో ఏకీభవిస్తూ ప్రజావేదిక కూల్చివేత నిలుపదలకు నిరాకరించింది. కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది .