ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి ప్రాంతంలో ఈదురుగాలుల బీభత్సం

ఎండల ఉక్కపోతతో అల్లాడుతున్న రాజధాని వాసులను వరుణుడు కరుణించాడు. వాతావరణ పరిస్థితుల్లో ఏర్పడిన మార్పులతో కృష్ణా, గుంటూరులోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. క్యుములో-నింబస్ మేఘాల వలన బలమైన గాలులతో కూడిన వర్షం పడింది. గాలుల బీభత్సానికి సచివాలయం పైకప్పులు ఎగిరిపడ్డాయి.

By

Published : May 7, 2019, 7:28 PM IST

రాజధానిలో ఈదురు గాలుల బీభత్సం...ఎగిరిపడిన ఇళ్ల పైకప్పులు

రాజధానిలో ఈదురు గాలుల బీభత్సం...ఎగిరిపడిన ఇళ్ల పైకప్పులు

హఠాత్తుగా మారిన వాతావరణ పరిస్థితులతో వీచిన ఈదురుగాలులు రాజధాని అమరావతిలో బీభత్సాన్ని సృష్టించాయి. ఈ గాలులకు రాష్ట్ర సచివాలయం నాలుగు, ఐదు బ్లాకుల్లోని పైకప్పులు ఎగిరిపడ్డాయి. ఉష్ణోగ్రతలు, గాలి తీవ్రతను కొలిచేందుకు ఏర్పాటు చేసిన స్మార్ట్ పోల్స్ విరిగిపడ్డాయి. సచివాలయం పైభాగంలో ఉన్న సౌరవిద్యుత్ పలకలు నేలకూలాయి. అమరావతిలోని మందడం, నేలపాడు, తూళ్లూరు, వెంకటపాలెం తదితర ప్రాంతాల్లో ఈదురుగాలుల కారణంగా చెట్లు విరిగిపడ్డాయి.

ఈదురుగాలుల బీభత్సానికి హైకోర్టు వద్ద ఉన్న క్యాంటీన్ పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఆ రేకులు తగిలి రమణమ్మ అనే మహిళకు తీవ్రగాయమైంది. చికిత్స నిమిత్తం మహిళను గుంటూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో కంకిపాడులో గాలుల తాకిడికి పలు ఇళ్లపై కప్పులు ఎగిరిపడ్డాయి. ఈదురుగాలుల కారణంగా పెదపులిపాకలో చెట్టు కూలి ఒకరు మృతి చెందారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పలు ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వర్షం పడింది. మారిన వాతావరణంతో కురిసిన చిన్నపాటి వర్షంతో విజయవాడ నగరవాసులు సేదతీరారు. ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు సాయంత్రం కురిసిన వర్షం ఆహ్లాదాన్ని కల్గించింది.

రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ఆర్టీజీస్ ప్రకటన జారీచేసింది. గుంటూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఆర్టీజీఎస్ సూచించింది.

ఇవీ చూడండి :పిడుగులు పడొచ్చు.. జాగ్రత్తగా ఉండండి!

ABOUT THE AUTHOR

...view details