ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎస్ఐ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. అమరావతిలోని అసెంబ్లీ ఆవరణలో ఫలితాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్ విశ్వజిత్ పాల్గొన్నారు.పోలీస్ శాఖలో వివిధ ఖాళీల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో 333 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. పోలీస్ శాఖలోని సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రిజర్వు సబ్ ఇన్ స్పెక్టర్, డిప్యూటీ జైలర్లు, స్టేషన్ ఫైర్ అధికారుల నియామకానికి సుమారు 10 నెలల క్రితం చేపట్టిన భర్తీ ప్రక్రియకు సంబంధించి నిర్వహించిన పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి.
ఈ పోస్టుల భర్తీకై మొత్తం లక్షా 35 వేల 414 మంది ధరఖాస్తు చేసుకోగా.. ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్లో 32 వేల 745 మంది అర్హత సాధించారు. అనంతరం వారికి నిర్వహించిన ఫైనల్ పరీక్షలో 333 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. వారిలో సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ కు 149 మంది, రిజర్వు సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఆర్మ్డ్ రిజర్వు) 75 మంది, రిజర్వు సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎపి స్పెషల్ పోలీస్) 75 మంది డిప్యూటీ జైలర్లు(పురుష) 10 మంది, డిప్యూటీ జైలర్(మహిళ) 4, స్టేషన్ ఫైర్ అధికారులు 20 మంది మొత్తం 333 మంది ఎంపికైనట్టు మంత్రి సుచరిత పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో పరుచూరి మహేశ్(నెల్లూరు), షేక్ హుస్సేన్ పీరా(కడప), పాలెం రవి కిశోర్(కడప) టాపర్లుగా నిలిచారు. ముగ్గురూ 255 మార్కులు వంతున పొందారని సుచరిత వెల్లడించారు.కృష్ణా జిల్లాకు చెందిన విశ్వనాధపల్లి ప్రజ్ఞ 224 మార్కులతో మహిళల్లో టాపర్ గా నిలిచారని పేర్కొన్నారు.
ఎంపికైన అభ్యర్ధుల ధ్రువపత్రాల పరిశీలన అనంతరం శిక్షణ ఇవ్వనున్నట్లు సుచరిత తెలిపారు. ఎంపికైన అభ్యర్ధులందరికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారని ఆమె పేర్కొన్నారు. కాగా పోలీస్ కానిస్టేబుళ్లు, వార్డర్లు, ఫైర్ మెన్లు, డ్రైవర్ ఆపరేటర్లకు నిర్వహించిన పరీక్షా ఫలితాలను కూడా త్వరలో విడుదల చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆమె తెలిపారు.