సభా సంప్రదాయాలను అధికారపక్షం విస్మరించిందని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. సభాపతిగా తమ్మినేని పేరును ప్రకటించాక తమ పార్టీకి ఓ మాట కూడా చెప్పలేదన్నారు. ఈ రోజు ఉదయం కూడా స్పీకర్ ఎన్నికకు ప్రతిపక్ష నేత అయిన తనను రమ్మని పిలవలేదని వివరించారు. అవసరమైతే రండి... లేదంటే రావద్దు అన్నట్లు ముఖ్యమంత్రి ప్రవర్తించారని విమర్శించారు. గతంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్పీకర్‌గా కోడెలను ఎంపికచేసినప్పుడు జగన్ వద్దకు మంత్రులను పంపాకే నామినేషన్లు వేసినట్లు గుర్తు చేశారు. ఇవేకాక అంతకు మునుపు తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంప్రదాయాలను విస్మరించలేదని అన్నారు. అధికార పక్షం సంప్రదాయాలను పాటించకపోయినప్పుటికీ తాము ప్రభుత్వానికి సహకరిస్తామని వెల్లడించారు. ప్రజలకు తెలయజెప్పేందుకే ఈ విషయాన్ని ప్రస్తావించానని.. ఎవరినీ విస్మరించడానికి కాదని స్పీకర్‌కు వివరించారు.