పాలన చేతకాకపోతే.. నేర్చుకోండి: చంద్రబాబు
జగన్‌కు పాలన చేతకాకపోతే నేర్చుకోవాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు హితవు పలికారు. మిగులు విద్యుత్‌తో రాష్ట్రాన్ని అప్పగిస్తే... కరెంట్ కోతలతో ప్రజలకు నరకం చూపిస్తున్నారని ఆరోపించారు. తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అమరావతిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. "ప్రభుత్వం విద్యుత్ కోతలతో నరకం చూపిస్తోంది. పాలన చేతకాకపోతే సమర్థులతో సంప్రదించి నేర్చుకోవాలి. అసమర్థ పాలనతో ప్రజలను కష్టాలకు గురి చేస్తున్నారు. తెదేపా ఐదేళ్ల కాలంలో మిగులు విద్యుత్ ఇచ్చాం. పీపీఏలపై సమీక్ష చేయాల్సిన ఆవశ్యకతపై జగన్ ప్రభుత్వం వితండవాదం చేస్తోంది. సమాధానం చెప్పలేని అయోమయస్థితి వారిలో నెలకొంది. భవిష్యత్తులో విద్యుత్ ధరలు పెరగకుండా జాగ్రత్తలు వహించాం. ఈ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అస్తవ్యస్తంగా మలుస్తోంది" అంటూ చంద్రబాబు ముఖ్యమంత్రిపై మండిపడ్డారు.