రైతులు, యువత, మహిళలు, వృద్ధులు, మధ్యతరగతి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం మేనిఫెస్టో రూపొందింది. తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇవాళ లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. 60 ఏళ్లకే వృద్ధాప్య ఫించను, మహిళలకు 55 సంవత్సరాలకే ఫించను వంటి జనాకర్షక పథకాలతో మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో కొత్త అంశాల ప్రస్తావన.. ఆయా వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వటం ఎంతో ముఖ్యం. ఎన్నికల్లో గెలుపునకు ఎంతో కీలకమైన.. మేనిఫెస్టోను రూపొందించడం ఏ పార్టీకైనా ఓ సవాల్ అనే చెప్పాలి. ఆచరణ సాధ్యం కాని హామీల విషయంలో జాగ్రత్త వహిస్తూ, అందుకు తగ్గ సమతుల్యం పాటించాలి. 2014 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చడంతో పాటు, ఎన్నో కొత్త పథకాలను కూడా ఈ ఐదేళ్ల కాలంలో చేశామని తెదేపా ఘనంగా చాటుకుంటోంది.
2019 ఎన్నికల మేనిఫెస్టో అదే తరహాలో ఉంటుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దాదాపు వందకు పైగా తెదేపా ప్రభుత్వం పథకాల ప్రస్తుతం అమలు చేస్తోంది. వీటన్నింటి మరింత మెరుగ్గా తీర్చిదిద్ది, ఓ ప్యాకేజీ రూపంలో అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉంది అధికార పార్టీ. ఈ క్రమంలో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో ఉంటుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
మేనిఫెస్టో పై ప్రజాభిప్రాయ సేకరణ..
ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన తెదేపా మేనిఫెస్టో కమిటీ ఇదివరకే పలుమార్లు సమావేశమై అనేక ప్రతిపాదనలు పరిశీలించి ఎన్నికల ప్రణాళికను రూపొందించింది. జనాకర్షక పథకాలతో అన్ని రంగాల వారీగా అనేక ప్రతిపాదనలను ఈ కమిటీ సిద్ధం చేసింది. తెదేపా అధినేత చంద్రబాబు ఇప్పటికే దీనికి తుది మెరుగులు దిద్దారు. ఇవాళ అమరావతి ప్రజావేదికలో మేనిఫెస్టోను లాంఛనంగా ప్రకటించనున్నారు. రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు www.tdpmanifesto.com వెబ్‌సైట్ ప్రారంభించారు. తద్వారా ప్రజల అభిప్రాయాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మేనిఫెస్టో తయారు చేసినట్లు తెదేపా వర్గాలు చెప్తున్నాయి.