నవరత్నాల అమలే కీలక అజెండాగా రాష్ట్ర బడ్జెట్ రూపుదిద్దుకుంది. మొత్తం రూ.2లక్షల 40వేల కోట్ల మేర ప్రతిపాదలు ఆర్థిక శాఖ స్వీకరించింది. వైకాపా ప్రకటించిన నవరత్నాల అమలుకే దాదాపు రూ.66వేల కోట్లకు పైగా ఈ బడ్జెట్లో కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ బడ్జెట్ ప్రవేశపెడతారు.
బడ్జెట్లో కీలకంగా అమ్మఒడి కార్యక్రమానికి సుమారు రూ.4వేల 9వందల కోట్ల మేర కేటాయించే అవకాశముంది. ఫీజు రీయంబర్స్మెంట్ పథకానికి రూ.5వేల కోట్లు, వైఎస్సార్ ఆసరా అమలుకు రూ.7వేల 500కోట్లు, అన్ని రకాల సామాజిక పింఛన్ల పంపిణీకి రూ.15వేల కోట్ల మేర బడ్జెట్లో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. గ్రామీణ, పట్టణ గృహనిర్మాణం కోసం రూ.8వేల కోట్లు కేటాయించినట్లు సమాచారం. కీలకమైన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కోసం రూ.6వేల 300కోట్లు కేటాయించనున్నారు. ప్రత్యేక కమిటీ సిఫార్సుల అనంతరం మరిన్ని కేటాయింపులు చేసే అవకాశం కనిపిస్తోంది.
జలయజ్ఞం ప్రాజెక్టుల కోసం రూ.8వేల కోట్లు ప్రతిపాదించనున్నట్లు సమాచారం. రాజధాని నిర్మాణానికి రూ.350 నుంచి 400కోట్ల మేర ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. పలు కార్పోరేషన్ల కోసం రూ.2 నుంచి 3వేల కోట్లు కేటాయించే అవకాశముంది. రైతులకు ఉచిత విద్యుత్ పంపిణీకి సుమారు రూ.4వేల కోట్ల మేర కేటాయింపులు చేసినట్టు సమాచారం. మద్యాహ్న భోజన పథకానికి వెయ్యి కోట్ల మేర ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఉద్యోగుల జీతభత్యాలకు రూ.28 నుంచి 30వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.