ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాపట్ల ఆర్టీసీ డీఎంపై అధికారుల చర్యలు..

Bapatla RTC Land Issue: ఆర్టీసీ స్థలంలో వైసీపీ కార్యాలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు యత్నించిన బాపట్ల ఆర్టీసీ డిపో మేనేజర్‌ శ్రీనివాసరెడ్డిపై వేటు పడింది. సంస్థ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. వైసీపీ కార్యాలయ నిర్మాణానికి అడ్డుతగిలారన్న కారణంతోనే ఆయనపై వేటు పడిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Bapatla depot manager
బాపట్ల ఆర్టీసీ డిపో మేనేజర్‌

By

Published : Dec 24, 2022, 8:14 AM IST

Updated : Dec 24, 2022, 12:23 PM IST

Bapatla RTC Land Issue: కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ భూమిని కాపాడటానికి యత్నించిన బాపట్ల డిపో మేనేజర్‌పై ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలంటూ.. ఆర్టీసీ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో చీరాల డీఎం శ్యామలను బాపట్ల ఇన్‌ఛార్జ్‌ డీఎంగా నియమించారు. బాపట్ల పారిశ్రామికవాడ, విద్యానగర్‌ మధ్య నాలుగెకరాల ఆర్టీసీ స్థలంలో రెండెకరాలను వైసీపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం లీజుకిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ఆ భూమిలో ఈ నెల 19న శంకుస్థాపనకు వచ్చిన వైసీపీ జిల్లా కన్వీనర్, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావును.. ఆర్‌ఎం విజయకుమార్‌రెడ్డితోపాటు డీఎం శ్రీనివాసరెడ్డి కలిశారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఆర్టీసీ స్థలంలో వైసీపీ కార్యాలయం ఎలా కడతారని అభ్యంతరం తెలిపారు. అయినా మంత్రులు, ప్రజాప్రతినిధులు కలిసి శంకుస్థాపన చేశారు. దీనిపై పట్టణ పోలీస్‌స్టేషన్‌తోపాటు తహసీల్దారుకు డీఎం శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సైతం ఈ భూమి ఆర్టీసీదేనని.. వైసీపీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించడంపై గట్టిగా నిరసన వ్యక్తం చేస్తున్నామని ప్రకటించారు. న్యాయపోరాటం చేసైనా ఆర్టీసీ ఆస్తులు కాపాడుకుంటామని చెప్పారు.

ఈ భూవివాదం రాష్ట్రస్థాయిలోనూ చర్చనీయాంశమైంది. ప్రభుత్వ తీరుపై తెలుగుదేశం తీవ్రస్థాయిలో మండిపడింది. మర్నాడు బాపట్ల కలెక్టర్‌ విజయకృష్ణన్‌ విలేకర్ల సమావేశం నిర్వహించి.. 2003 డిసెంబర్‌లోనే ఆర్టీసీ నుంచి నాలుగెకరాల భూమిని ఏపీఐఐసీ తీసుకుందని తెలిపారు. 2016లో జారీ చేసిన జీవోకు అనుగుణంగానే వైసీపీ జిల్లా కన్వీనర్ మోపిదేవి వెంకటరమణారావు నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు.. రెండెకరాల భూమిని వైసీపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి కేటాయిస్తూ సీసీఎల్​ఏకి ప్రతిపాదనలు పంపించామన్నారు. ఈ ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించి ప్రభుత్వం జీవో జారీ చేశాకే.. భూమిని వైసీపీకు అప్పగించామని వివరించారు. ఈ భూమి ఆర్టీసీది కాదని ప్రకటించారు. రెవెన్యూ అధికారుల ప్రకటనతో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును డీఎం ఉపసంహరించుకున్నారు.

ఆర్టీసీకి యాజమాన్య హక్కులు లేకపోయినా పోలీసులు.. రెవెన్యూ అధికారులకు డీఎం ఫిర్యాదు చేయడంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ ఫిర్యాదు వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని భావించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో బాపట్ల డీఎం శ్రీనివాసరెడ్డిని ఆ పోస్టు నుంచి తప్పించి.. ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని సంస్థ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. డీఎం శ్రీనివాసరెడ్డిపై ఉన్నతాధికారులు వేటు వేయడం.. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల్లో చర్చనీయాంశమైంది.

బాపట్ల ఆర్టీసీ డీఎంపై వేటు

ఇవీ చదవండి :

Last Updated : Dec 24, 2022, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details