అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం నాగినాయని చెరువు తండాకి దేశంలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 120 కుటుంబాలు నివసించే ఈ గ్రామంలో.. నిరక్ష్యరాస్యులు కనిపించరు. సుమారు వంద కుటుంబాల్లోని వారు ప్రభుత్వ ఉద్యోగస్తులే. వీరిలో హైకోర్టు న్యాయమూర్తులు, ఐఏఎస్, ఐపీఎస్, రైల్వే అధికారులు, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారే అధికం. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మోతీలాల్ నాయక్, విశ్రాంత ఐఏఎస్ అధికారి రామశంకరనాయక్ ఇలా అనేక మంది నాగినాయని చెరువు నుంచి ఎదిగిన వారే.
సరైన సౌకర్యాలు, పాఠశాల లేక విద్యార్థులు పడుతున్న కష్టాలను చంద్రనాయక్ అనే పెద్దాయన దూరం చేశారు. 1940లోనే పెనుకొండలో ఓ వసతి గృహాన్ని ఏర్పాటు చేసి..అక్కడే చదువుకునేలా సదుపాయాలు కల్పించారు. ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేజిక్కించుకునేలా ఎందరినో ప్రోత్సహించారు. ఊరిపేరు చిరస్థాయిగా నిలిచేలా సాయపడ్డారు. తన తండ్రి కృషిని గర్వంగా చెప్పుకుంటారు చంద్రానాయక్ కుమారుడు. ఆ వసతి గృహంలో చదివి ఉన్నతస్థాయికి చేరుకున్న వారంతా.. గ్రామంలోని మిగతా విద్యార్థులు బాగా చదువుకునేలా కృషి చేశారు. ఈ ప్రోత్సాహం మరింత మందిని ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధించేలా స్ఫూర్తినింపింది. లింగ వివక్ష చూపకుండా.. బాలికలనూ బాగా చదివిస్తూ వస్తున్నారు.