పంచాయతీ ఎన్నికల దృష్ట్యా అనంతపురం జిల్లాలో కొన్నిచోట్ల ప్రత్యర్థి అభ్యర్థులకు నగదు ఆశ చూపించి ఏకగ్రీవానికి యత్నిస్తుండగా.. మరికొన్ని చోట్ల ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాన్ని బూచీగా చూపుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేస్తే పెద్దమొత్తంలో ప్రోత్సాహం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంతో పోలిస్తే నగదు ప్రోత్సాహకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఊరంతా ఒకమాట మీదకు వచ్చి ప్రలోభాలకు లోనుకాకుండా.. బెదిరింపులకు తావివ్వకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఏకగ్రీవాలు జరిగితే మంచిదే. కానీ సదుద్దేశానికి కొందరు తూట్లు పొడుస్తున్నారు.
ప్రతిపక్ష అనుకూల పంచాయతీల్లో ..
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైకాపా ఈసారి అత్యధిక పంచాయతీల్లో తమ మద్దతుదారులను గెలిపించుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. తొలి విడతలో ఎన్నికలు జరిగే కదిరి డివిజన్ పరిధిలోని పంచాయతీల్లో వీలైనన్ని ఏకగ్రీవం చేసుకోవాలని చూస్తున్నారు. 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక పంచాయతీల్లో తెదేపా మద్దతుదారులు గెలుపొందారు. ఈ నేపథ్యంలో తెదేపా బలంగా ఉన్న పంచాయతీలపై వైకాపా దృష్టి పెట్టింది. వాటిని ఎలాగైనా దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రతిపక్షానికి అనుకూలంగా ఉన్నవాటిని ఏకగ్రీవం చేసుకుని, తమ బలం నిరూపించుకోవాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యర్థులపై బెదిరింపుల పర్వానికి తెరతీసినట్లు సమాచారం. మరోవైపు ప్రతిపక్ష తెదేపా పట్టుదలగా ముందుకు వెళ్తోంది. అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధమైంది.
కదిరి నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఏర్పడిన ఓ పంచాయతీని ఏకగ్రీవం చేసుకోవాలని ఓ డివిజన్‌స్థాయి పోలీసు అధికారి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ అధికారి పొరుగు జిల్లాలో పనిచేస్తున్నారు. తన కుటుంబ సభ్యులను ఎన్నికల బరిలో నిలిపారు. శుక్రవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇదే పంచాయతీ నుంచి పోటీ చేయాలనుకున్న కొందరు యువకులను బెదిరించినట్లు సమాచారం.