విద్యుద్ఘాతానికి తల్లి, బిడ్డ మృతి - son
బతుకుదెరువు కోసం కర్నాటక నుంచి ఏపీకి వచ్చిన కుటుంబాన్ని విద్యుత్తు కబళించింది. బిడ్డను కాపాడడానికి వెళ్లిన తల్లిని కూడా మింగెసింది.
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పెంచలపాడులో విషాదం చోటుచేసుకుంది. కర్నాటక రాష్ట్రం నుంచి కాలువ లైనింగ్ పనులకు కూలీకి వచ్చిన నిరుపేద కుటుంబంలోని తల్లి, కుమారుడు విద్యుద్ఘాతంతో మృతి చెందారు. పెంచలెపాటు వద్ద గుంతకల్లు బ్రాంచి కాలువ లైనింగ్ పనుల కోసం రాయచూరు జిల్లా భీంసేబోగాపూర్ తాండా నుంచి పది కుటుంబాలు వలస కూలీలుగా వచ్చాయి. లైనింగ్ పనుల కోసం గుత్తేదారు పెంచలపాడు గ్రామం వద్ద ఇసుక డంప్‌ను ఏర్పాటు చేశారు. దీనిపై ఆడుకోవడానికి కూలీల పిల్లలు వెళ్లగా.. చేయి తగిలేంత ఎత్తులో ఉన్న విద్యుత్ తీగ తొలుత రెండేళ్ల చిన్నారి ప్రీతమ్ నాయక్‌కు తాకింది. గమనించిన ఆ చిన్నారి తల్లి రంకాబాయి పరుగున వెళ్లి విద్యుద్ఘాతం నుంచి తప్పించబోయి తాను ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రీతమ్ నాయక్, రంకాబాయిలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. గుత్తేదారు నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు.