TDP National General Secretary Nara Lokesh' 'Yuvagalam; Padayatra updates: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర నేటితో 66 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 66వ రోజు పాదయాత్రను లోకేశ్.. అనంతపురం జిల్లాలోని సోదనపల్లి విడిది కేంద్రం నుంచి ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా ఆయన.. యాదవ, గాండ్ల, ఎస్సీ సామాజిక వర్గీయులతో భేటీయ్యారు. అనంతరం సోదనపల్లిలో గొర్రెల కాపరులతో లోకేశ్ మాట్లాడారు. గొర్రెల కాపరుల సమస్యలను అడిగి తెలుసుకొని.. టీడీపీ అధికారంలోకి వచ్చాక గొర్రెల కాపరుల సమస్యలను తీర్చేందుకు సబ్సిడీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
గొర్రెల కాపరులకు సబ్సిడీ రుణాలు: అనంతపురం జిల్లాలోని సోదనపల్లిలో ఈరోజు నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో శ్రీను అనే గొర్రెల కాపరితో లోకేశ్ మాట్లాడారు. ఈ క్రమంలో ఆ గొర్రెల కాపరి (శ్రీను) మాట్లాడుతూ..''నాకు గతంలో 500 గొర్రెలు ఉండేవి. ఈ గవర్నమెంట్ వచ్చాక అకాల వర్షాల వల్ల గొర్రెలకు మేతలేక.. అప్పులు చేసిన బయట్నుంచి మేత తెచ్చుకున్నాము. కానీ, వడ్డీల రేట్లు కట్టలేక గొర్రెలను అమ్ముకున్నాము. ఇప్పుడు నా దగ్గర 100 గొర్రెలు మాత్రమే ఉన్నాయి. టీడీపీ గవర్నమెంట్‌లో ప్రతి సంవత్సరం మాకు గొర్రెలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సబ్సిడీ రుణాలు ఇచ్చేవారు. ఈ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా సబ్సిడీ ఇవ్వలేదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మాకు ఏదైనా సహాయం చేయండి సారూ. '' అని లోకేశ్‌ను కోరారు. వెంటనే స్పందించిన లోకేష్.. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రంలోని గొర్రెల కాపరులందరికీ ప్రభుత్వం నుంచి సబ్సిడీ రుణాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
67వ రోజు పాదయాత్ర షెడ్యూల్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర రేపటితో 67వ రోజుకు చేరనుంది. ఇప్పటికే ఎనిమిది నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేసుకున్న లోకేశ్.. రేపు తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించనున్నారు. ఈ క్రమంలో లోకేశ్‌కు ఉదయం ఏడు గంటలకు తాడిపత్రి నియోజకవర్గ సరిహద్దులో ఘన స్వాగతం పలకడానికి జేసీ సోదరుల కుటుంబం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. శింగనమల నియోజకవర్గంలో 15 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించిన లోకేశ్.. గత నెల చిత్తూరు జిల్లాలో పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి 845 కిలోమీటర్లు పూర్తి చేశారు.