Yuvagalam padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 55 రోజులు పూర్తయ్యింది. పాదయాత్రలో 55వ రోజు లోకేశ్ 11.8 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 706.9 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తయ్యింది. 56వ రోజూ పాదయాత్ర రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో సాగనుంది.
పలు సమావేశాలు.. సీకే పల్లి పంచాయతీ కోన క్రాస్ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమవనుండగా.. వెంకటంపల్లి గ్రామస్తులతో సమావేశం కానున్నారు. సీకే పల్లి బీసీ కాలనీలో బీసీ సామాజిక వర్గీయులతో భేటీ అవ్వనున్నారు. అనంతరం యర్రంపల్లిలో జాకీ ఫ్యాక్టరీ బాధితులతో సమావేశం నిర్వహించనున్నారు. నాగసముద్రం క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ నిర్వహించిన అనంతరం నాగసముద్రం గేట్ వద్ద ఆటోడ్రైవర్లు, మెకానిక్ లతో సమావేశమవనున్నారు. నాగసముద్రంలో స్థానికులతో భేటీ తరువాత బసినేపల్లి క్రాస్ వద్ద మధ్యాహ్న భోజన విరామం తీసుకోనున్నారు. భోజన విరామం అనంతరం ఉప్పరవాండ్ల కొట్టాలు క్రాస్ వద్ద సత్యసాయి వర్కర్లతో సమావేశం కానున్నారు. పైదిండి సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో లోకేశ్ ప్రసంగించనున్నారు. రాత్రికి పైదిండి శివార్లలో విడిది కేంద్రంలో బస చేయనున్నారు.
రాప్తాడు నియోజకవర్గంలోకి ఘన స్వాగతం..యువగళం పాదయాత్ర 55వ రోజు ముగియగా.. రాప్తాడు నియోజకవర్గంలోకి స్వాగతం పలికేందుకు గుంటూరు కనుమ వద్ద మాజీ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. రాప్తాడు నియోజకవర్గంలోని పలువురు మహిళలు కలశాలు మోసుకుని వచ్చి లోకేశ్‌కు స్వాగతం పలికారు. సునీత ఆధ్వర్యంలో భారీ జన సందోహం నడుమ యువగళం పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి మండలంలోకి ప్రవేశించింది. యువగళం రాప్తాడు నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన నారా లోకేష్‌కు మాజీ మంత్రి పరిటాల సునీత ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ ఘన స్వాగతం పలికారు. రాప్తాడు నియోజకవర్గం లోని చెన్నై కొత్తపల్లి మండలం కోన వద్ద కలశాలతో పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు, టీడీపీ కార్యకర్తలు, పరిటాల కుటుంబ అభిమానులు నారా లోకేశ్‌ను సాదరంగా ఆహ్వానించారు ఇవాళ చెన్న కొత్తపల్లిలో నారా లోకేశ్ బస చేయనున్నారు.
కియా పరిశ్రమతో వేలాది మందికి ఉద్యోగాలు.. ప్రతి పక్ష నేతగా గతంలో జగన్మోహన్రెడ్డి చెప్పిన అబద్దాలను ప్రజలు గ్రహించాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఓ వీడియో విడుదల చేశారు. జగన్ ప్రతిపక్ష నేతగా పెనుగొండ నియోజకవర్గంలో చేసిన ప్రసంగాన్ని విడుదల చేశారు. ఆనాడు ప్రతిపక్ష నేత హోదాలో కియా పరిశ్రమ కోసం బలవంతంగా అప్పటి ప్రభుత్వం భూములు తీసుకుంటుందంటూ జగన్ చేసిన ప్రసంగాన్ని విడుదల చేశారు. మూడు పంటలు పండే భూములను అప్పటి సీఎం చంద్రబాబు తీసుకుంటున్నారంటూ జగన్ ఆరోపణలు చేశారని మండిపడ్డారు. భూములు ఎవరు ఇవ్వద్దంటూ మీకు అండగా నేను ఉంటాను.. అంటూ ఆనాడు జగన్ ప్రసంగించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు అవే భూముల్లో కియా పరిశ్రమ వచ్చి వేలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి కదా అంటూ జగన్‌ను లోకేష్ ప్రశ్నించారు.
ఇవీ చదవండి :