భూఅక్రమాలను నిరూపించాలంటూ మంత్రి ఉష శ్రీచరణ్ సవాలుకు స్పందించిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తూంపల్లి భూముల పరిశీలనకు తెలుగుదేశం పిలుపునివ్వగా.. టీడీపీ నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలువురు నాయకులకు ముందస్తు నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధం చేశారు. పోలీసుల అడ్డగింతతో అనంతపురంలో తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
అడ్డుకున్న పోలీసులు :తూంపల్లి సుజలాన్ పవన విద్యుత్ పార్కు ఏర్పాటుకు ఇచ్చిన 120 ఎకరాల భూములను.. ఆ సంస్థ నుంచి కొనుగోలు చేసి స్థానిక రైతులకు డబ్బులివ్వకుండా మంత్రి రిసార్టు ఏర్పాటు చేశారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. మట్టి, ఇసుకను సైతం రిసార్ట్‌కు అక్రమంగా తరలిస్తున్నారన్న విమర్శలపై స్పందించిన మంత్రి ఉష శ్రీచరణ్.... ఎలాంటి అ్రకమాలకు పాల్పడలేదని, ఆధారాలుంటే నిరూపించాలని సవాల్ విసిరారు. ఈ సవాల్‌కు సరేనన్న తెలుగుదేశం నేతలు... భూముల పరిశీలనకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. తూంపల్లి వెళ్లేందుకు బయల్దేరిన నేతలను జిల్లా తెదేపా కార్యాలయం వద్ద అదుపులోకి తీసుకున్నారు. కళ్యాణదుర్గం ఇన్‌ఛార్జి ఉమమహేశ్వరనాయుడు, మాజీ మంత్రి నిమ్మల కిష్టప్పను అరెస్ట్ చేశారు.