మహాత్మాగాంధీ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ పథకానికి శ్రీకారం చుట్టింది. దీనిని మరింత సమర్థంగా అమలు చేసేందుకు జాతీయ షెడ్యూల్ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థతో ముందడుగు వేసింది. సాంకేతికతతో కూడిన గార్బేజి వాహనాలు, ట్రాక్టరు లోడర్లు షెడ్యుల్ కులాల లబ్ధిదారులకు రాయితీతో అందజేయాలని సంకల్పించింది. గ్రామీణ ప్రాంతాల్లో మురుగు కాలువలను సులువుగా శుభ్రం చేసేందుకు ట్రాక్టరు లోడర్లు ఉపయోగపడతాయి. గార్బేజి వాహనాలకు 60 శాతం రాయితీ, ట్రాక్టరు లోడరుకు 35 శాతం రాయితీ, 60 శాతం రుణం, రూ.20 వేలు లబ్ధిదారు వాటాగా చెల్లించాల్సి ఉంటుంది.
సమన్వయ లోపం
గార్బేజి వాహనాలు, ట్రాక్టరు లోడర్లు పొందిన లబ్ధిదారులు అనంతపురం జిల్లాలోని 2,500 కంటే జనాభా ఎక్కువ ఉన్న పంచాయతీ కార్యాలయాలకు అద్దెకు ఇవ్వాలి. ప్రతి నెలా పంచాయతీలు అద్దెను చెల్లించిన తర్వాత, ఆ మొత్తంలో బ్యాంకు రుణం చెల్లించి మిగిలిన సొమ్ము లబ్ధిదారు ఖాతాలో జమ చేసేలా కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. పంచాయతీ అధికారులు, కార్పొరేషన్ మధ్య సమన్వయం కుదరక వాహనాల పంపిణీ ఆగిపోయింది. పంచాయతీల వద్ద నిధులు లేవన్న సాకుతో వాహనాలను అద్దెకు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పటికే లబ్ధిదారులతో పలుమార్లు దరఖాస్తులు స్వీకరించారు. వారితో ఒప్పందం చేయించుకున్నారు. అయితే వాహనాలను పంపిణీ చేయలేదు.
పంపిణీకి చర్యలు తీసుకుంటాం
ఆటోలు, ట్రాక్టరు ట్రాలీలు కొన్ని నెలలుగా పంపిణీ చేయకపోవడం వాస్తవమే. పంచాయతీ అధికారులతో సంప్రదించాం. ఇప్పటికే సమస్యను కలెక్టర్ గంధం చంద్రుడు దృష్టికి తీసుకెళ్లాం. వాహనాలను లబ్ధిదారులకు అప్పగించే వరకు వాటి పనితీరును చూడాల్సిన బాధ్యత వాహన సంస్థలదే. త్వరలోనే వాహనాలను అప్పగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. - యుగంధర్, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్