ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ సమయంలో నేను ఎక్కడికి వెళ్లాలి నాన్న! - భారమైంది

బాల్యంలో అమ్మ గోరు ముద్దలు తినిపిస్తుంది. తప్పటడుగులు వేయకుండా...సరైన దారిలో నడిపిస్తోంది. బిడ్డకు కష్టం వస్తే కన్నీరు పెడుతుంది. అలాంటి అమ్మే ఇప్పుడు భారమైపోతోంది. వయస్సు మీద పడి అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఓ సుపుత్రుడు రాత్రి ఇంటి నుంచి బయటకు తోసేశాడు.

son_kicked_mother_from_his_house

By

Published : Jul 2, 2019, 9:52 AM IST

Updated : Jul 2, 2019, 10:40 AM IST

ఈ సమయంలో ఎక్కడికి వెళ్లాలి నాన్న నేను!

నవమాసాలు మోసి.. పెంచి.. పెద్ద చేసేదే తల్లి. ఇప్పుడు వారికే ఆదరణ కరవైంది. ఆరోగ్యం బాగాలేదని ఒకరు. వయసు మీద పడింది..సేవలు చేసే ఓపిక నాకెక్కడిది అని మరొకరు. ఇలా రక్తం దారబోసిన తల్లిని బయటకు గెంటేస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో ఇలాంటి ఘటనే జరిగింది. అర్ధరాత్రి కన్నతల్లిని ఇంటి నుంచి బయటకు పంపేశాడో కుమారుడు.

అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన బాబులమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పని చేసి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. భర్త మృతి తర్వాత బాబులమ్మ కొడుకు అమీర్ కలిసి పట్టణంలోనే నివాసం ఉంటున్నారు. అమీర్​కు పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్​గా ఉద్యోగం వచ్చింది. అమీర్ భార్య ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. వయసు మీద పడటంతో ఎవరు సాకాలనే సాకుతో గతంలో కర్ణాటకలోని ఓ వృద్ధాశ్రమంలో వదిలి వచ్చారు బాబులమ్మను. కొడుకు మీద మమకారంతో అక్కడ ఉండలేక తిరిగి వచ్చేసింది ఆ తల్లి. గత రాత్రి ఇంటి నుంచి పంపేయాలనుకున్న కొడుకు ఆటోడ్రైవర్​ను పిలిపించాడు. బస్టాండ్​లో వదిలేయలంటూ చెప్పడంతో ఒక్కసారిగా ఆ తల్లి మనసు చివుకుమంది. కాలు, చేయి కదపలేని తాను ఈ సమయంలో ఎక్కడికి వెళ్లాలి నాన్న అంటూ వేడుకున్న కొడుకు కనికరించలేదు. కష్టపడి ఇంత పెద్దవాడిని చేస్తే...కొడుకు నడిరోడ్డుపై వదిలేస్తున్నాడేంటని ఆవేదన చెందింది.

ఆటో డ్రైవర్ తీసుకెళ్లి బస్టాండ్​లో వదిలేశాడు. దిగాలుగా కూర్చున్న ఆ తల్లిని చూసి ప్రయాణికులు విషయాన్ని అవుట్ పోస్ట్​ పోలీసులకు తెలిపారు. పోలీసులు వృద్ధురాలిని పట్టణ పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లారు. కుమారుడి వివరాలు తెలుసుకుని..పంపిద్దామనుకుంటే.. నేను వెళ్లనంటూ...ఆ అమ్మ కన్నీటి పర్యంతమైంది. బాధితురాలి నుంచి వివరాలు సేకరించి వాటి ఆధారంగా ఆమె కుమారుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Last Updated : Jul 2, 2019, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details