సర్పంచి ఎన్నికల్లో తాను గెలిచినా.. ఎన్నికల రిటర్నింగ్ అధికారి మభ్యపెట్టి మరో అభ్యర్థి గెలుపునకు సహకరించారని, తనకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన ఓ మహిళ ఎనిమిదేళ్ల పోరాటం తర్వాత ఎట్టకేలకు విజయం సాధించారు. 2013 జులై 31న జరిగిన ఎన్నికల్లో అనంతపురం జిల్లా పామిడి మండలంలోని దేవరపల్లి సర్పంచి స్థానానికి తెదేపా మద్దతుదారుగా జయమ్మ, కాంగ్రెస్ మద్దతుతో ఓబులమ్మ పోటీ చేశారు. అప్పట్లో ఓబులమ్మ గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శంకర్ ధ్రువపత్రం అందజేశారు. అయితే తాను ఒక్క ఓటు తేడాతో గెలిచానని, రిటర్నింగ్ అధికారి మభ్యపెట్టి ఓబులమ్మ గెలిచినట్లు ధ్రువపత్రం ఇచ్చారని జయమ్మ.. గుత్తి జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు జయమ్మ ఒక్క ఓటుతో గెలిచినట్లు 2018 అక్టోబర్ 10న తీర్పు వెలువరించింది. అయితే అప్పటికే సర్పంచిగా పదవీకాలం పూర్తి కావడంతో దస్త్రాల్లో తన పేరు నమోదు చేయించి, గౌరవ వేతనం అందించాలని బాధితురాలు హైకోర్టును ఆశ్రయించారు. దిగువ కోర్టు తీర్పును హైకోర్టు సమర్ధించింది.
కోర్టు ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం అనంతపురంలో డీపీవో పార్వతీ, పంచాయతీ కార్యదర్శి సుమలత సమక్షంలో అప్పట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన శంకర్ చేతుల మీదుగా జయమ్మకు గెలుపు ధ్రువపత్రాన్ని అందజేశారు.