రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి కదిరి నియోజకవర్గం పరిధిలో చెరువులు కుంటలు వర్షపు నీటితో నిండిపోయాయి. వాగులు వంకల్లో జల సవ్వడి వినిపిస్తోంది. నంబులపూలకుంట మండలంలోని తాటిమాను గుంతలో ఉద్యాన పంటలు నీటమునిగాయి. గాండ్లపెంట మండలం పోతులవాండ్లపల్లిలో పిడుగుపాటుకు రైతు చలపతి నాయుడుకు చెందిన రెండు ఆవులు మృతి చెందాయి. పాయకట్టు గ్రామంలో సమీపంలోని చెక్ డ్యామ్ తెగి ఇళ్లలోకి నీరు చేరాయి.
కదిరి రెవెన్యూ డివిజన్ లోనే అత్యధికంగా నంబులపూలకుంట మండలంలో వరుసగా రెండు రోజులు 102, 105మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. కదిరి మండలం కౌలేపల్లి వద్ద ఉన్న జిల్లాలోని దేవర చెరువు నిండి మరువ పారుతోంది. పట్టణానికి సమీపంలో ఉన్న ఈ చెరువు మరువను సందర్శించేందుకు వచ్చే వారితో ఆ ప్రాంతం రద్దీగా మారింది. మరోవైపు.. పట్టణానికి సమీపంలోని కుంతి తీర్తం సమీపంలోని మద్ది లేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.