Pure EV company new innovation: ఐఐటీ హైదరాబాద్ అంకుర సంస్థ ప్యూర్ ఈవీ.. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా.. అభివృద్ధి చెందుతోంది. నిరంతర పరిశోధనలతో అంతర్జాతీయ ఆటో మొబైల్ సంస్థలకు సైతం లేని.. అత్యాధునిక సాంకేతికతను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో తన సత్తా చాటుతున్న ప్యూర్ ఈవీ తాజాగా విడుదల చేసిన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌తో మరో మైలురాయి దాటింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విద్యుత్ మోటార్ సైకిళ్లు.. సాధారణ ప్రజల నిత్యజీవిత కార్యకలాపాలకు అనుగుణంగా లేకపోవడంతో.. వినియోగదారుల నుంచి పూర్తి స్థాయిలో ఆసక్తి లభించడం లేదు. దీనిని గుర్తించిన ప్యూర్ ఈవీ ఈ సరికొత్త ఆవిష్కరణ చేసింది.
ఐఐటీ హైదరాబాద్- ప్యూర్ ఈవీ పరిశోధనా కేంద్రంలో అభివృద్ధి చేసిన 3 కిలోవాట్ బ్యాటరీని ఈ వాహనంలో వినియోగించారు. దీనిపై వీరికే పేటెంట్ ఉండటంతో పాటు.. గరిష్ఠంగా గంటకు 75 కిలోమీటర్ల వేగం దీని ప్రత్యేకత. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 135 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని.. ప్రయాణికుల భద్రత, రక్షణ కోసం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించినట్లు సంస్థ స్పష్టం చేసింది. ఈ విద్యుత్ మోటార్ సైకిల్‌ను ఎకోడ్రిఫ్ట్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేశారు.