Mystery Murder : అనంతపురం జిల్లా పామిడి పట్టణ శివారులో రైల్వే ట్రాక్ పై "తల లేని మొండెం "మిస్టరీ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. ఓ వ్యక్తిని తన ప్రియురాలు ఆమె తల్లి, మరో వ్యక్తితో కలిసి అతి కిరాతకంగా హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. కాగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పామిడి సర్కిల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం :కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన శంకరనాయక్ గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసుకొని వడ్డీ వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడని అదే గ్రామంలో కేశవయ్య అనే వ్యక్తిని వివాహం చేసుకున్న పామిడి మండలానికి చెందిన రాజేశ్వరిని మహిళ నర్సరీకి పనికి వస్తూ శంకర నాయక్తో సాన్నిహిత్యం ఏర్పరచుకున్నట్లుగా పామిడి సర్కిల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
కొంతకాలం తర్వాత రాజేశ్వరి భర్త కేశవయ్య కరోనా సమయంలో మృతి చెందడం, ఆర్థిక ఇబ్బందులతో రాజేశ్వరి శంకర నాయక్ వద్ద ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే శంకర్ నాయక్ రాజేశ్వరి వివాహేతర బంధం కొనసాగిస్తున్న విషయం ఇంట్లో తెలిసిందని.. దీంతో ఆమె సొంత గ్రామమైన పామిడి మండలం రామగిరిలో ఉన్న తల్లి వద్దకు వెళ్ళిపోయిందని పోలీసులు వెల్లడించారు.
అంతం చేసిన అక్రమ సంబంధం:శంకర్ నాయక్ తన అక్రమ సంబంధాన్ని అలాగే కొనసాగిస్తూ.. తీసుకున్న అప్పు చెల్లించమని ఒత్తిడి చేస్తుండటంతో ప్రియురాలు రాజేశ్వరి ఆమె తల్లి నారాయణమ్మ మరో వ్యక్తి సాయితో కలిసి ఎలాగైనా శంకర్ నాయక్ హతమార్చాలని పథకం వేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో 9వ తేదీ రాత్రి వారి ఇంటికి వచ్చిన శంకర్ నాయక్ కళ్ళలో కారం కొట్టిన తల్లి నారాయణమ్మ శంకర్ నాయక్ కాళ్లు, రాజేశ్వరి చేతులు పట్టుకోగా సాయి అత్యంత కిరాతకంగా చురకత్తితో గొంతు కోసి హత్య చేశారని పోలీసులు చెప్పారు.
హత్యానంతరం :మృతదేహాన్ని ఒక గోనె సంచిలో కట్టి సాయి, రాజేశ్వరిలు బైక్ పై 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎద్దులపల్లి వద్దకు తీసుకెళ్లి రైల్వే ట్రాక్ పై పడేసి తలను మాయం చేసి.. గోనె సంచిని ఆధారాలు లేకుండా కూడా కాల్చివేసినట్లు తెలిపారు. దీంతో ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పామిడి పోలీసులు, గుంతకల్లు రైల్వే పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు ప్రారంభించి ఎట్టకేలకు పోలీసులు నిందితులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు.
అనంతరం పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితులు మొత్తం హత్య చేసిన విధానాన్ని పోలీసులకు వెల్లడించారు. తీసుకున్న అప్పు చెల్లించమని అడిగినందుకు ప్రియుడిని అత్యంత దారుణంగా హతమార్చిన ప్రియురాలు రాజేశ్వరి ఆమె తల్లి నారాయణమ్మ వీరికి సహకరించి హత్యలో పాల్గొన్న సాయిని అరెస్టు చేసిన రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన రెండు కత్తులను, బైకును స్వాధీనం చేసుకుని పోలీసులు సీజ్ చేశామని చెప్పారు.
ఇవీ చదవండి :