దేశంలో రక్తదానం, నేత్ర దానంపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన వచ్చింది. దేశ వ్యాప్తంగా కోట్ల మంది క్రమం తప్పకుండా రక్తదానం చేస్తున్న సందర్భాలు నిత్యం చూస్తూనే ఉన్నాం. మరణానంతరం నేత్రదానం చేసేందుకు ఎంతో మంది స్వచ్ఛందంగా ఆసుపత్రులకు ఆమోద పత్రాలు ఇస్తుంటారు. సాటి మనిషి ప్రాణం కాపాడేందుకు రక్తదానం చేస్తుంటారు. నేత్రదానంతో అభాగ్యులకు కంటి వెలుగునిస్తుంటారు. వీటిలానే ప్లాస్మాదానం కూడా ఎంతో ముఖ్యమైంది నేడు. ప్రస్తుతం ప్రపంచమంతా ఎదురుచూస్తుంది ఒక్కటే... కరోనా వైరస్ వ్యాక్సిన్. అనేక దశల ప్రయోగాల అనంతరం గానీ వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదంటున్నారు నిపుణులు. ఈ సమయంలో ప్లాస్మా చికిత్స.. బాధితులకు ఓ మార్గాన్ని చూపిస్తుంది. కరోనా నుంచి కోలుకున్న రోగి రక్తంలోని ప్లాస్మాతో కొత్తగా కరోనా వైరస్ సోకిన రోగికి వైద్యం చేసే అంశంపై పరిశోధనలు చేస్తున్నారు.
అమెరికాలో మొదటిగా...
అమెరికాలో ప్లాస్మా చికిత్స 1917వ సంవత్సరంలోనే విజయవంతంగా నిర్వహించారు. 1918లో వైద్య జర్నల్ లో ఈ చికిత్స గురించి ప్రకటించారు. పలు దేశాల్లో వివిధ సందర్భాల్లో ప్లాస్మా చికిత్స అరుదుగా నిర్వహిస్తున్నారు. అయితే మొండి వైరస్ గా మారిన కొవిడ్ కు... ఆ వ్యాధి నుంచి కోలుకున్న వ్యక్తి ప్లాస్మాతో వైద్యం చేయవచ్చని నిపుణులు ఈ చికిత్సను తెరమీదకు తెచ్చారు.
ప్లాస్మా డేటా బ్యాంకు కీలకం
ఈ నేపథ్యంలో వైరస్ సోకిన రోగులకు సంబంధించి పూర్తి సమాచారం తీసుకోవటంతోపాటు, ప్లాస్మా ఇవ్వటానికి ఆమోద పత్రం తీసుకుంటే భవిష్యత్ లో ఎన్నో ప్రాణాలను నిలబెట్టవచ్చేనే ఆలోచన చేస్తే బాగుంటుందని నిపుణులు అంటున్నారు. ఈ సమాచారంతో ఓ డేటా బ్యాంక్ ఏర్పాటు చేస్తే ప్లాస్మా వైద్యం ఒక్క కరోనాకే కాకుండా అనేక వైరస్ లకు సంబంధించిన వ్యాధులు నయం చేయటానికి కీలకంగా మారుతుందంటున్నారు.