Incomplete Distribution Canals of Handri Neeva Project: హంద్రీనీవా తొలి దశలో మిగిలిపోయిన డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేస్తే.. ఒక్క అనంతపురం జిల్లా లోనే లక్షా 18 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వచ్చన్నారు జగన్. టీడీపీ ప్రభుత్వం ఆ పని చేయలేదని, తాను అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చేసి చూపిస్తానని ఆయన ఆవేశంగా ప్రకటించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. 2017 ఫిబ్రవరి 6న అనంతపురం జిల్లా ఉరవకొండలో మహాధర్నా చేశారు. జగన్ ముఖ్యమంత్రయ్యారు. రెండేళ్లు కాస్తా నాలుగేళ్లు కావస్తోంది. కానీ డిస్ట్రిబ్యూటరీ కాల్వల ఊసేలేదు. పూర్తి చేయడం దేవుడెరుగు కనీసం ప్రారంభించనే లేదు.
అనంతపురం జిల్లాలో హంద్రీనీవా ప్రాజెక్టు తొలిదశ పనులను క్షేత్రస్ధాయిలో పరిశీలిస్తే.. కాల్వల్లో పారాల్సిన నీళ్లు.. రైతుల కళ్లలో కన్నీళ్లు ఉబుకుతున్నాయి. ప్రధాన కాలువకు అనుబంధంగా డిస్ట్రిబ్యూటరీ కాలువలు కట్టించకపోవడం వల్ల.. పొలాలు బీడుబారుతున్నాయి. మొదటి దశలో పేరూరు బ్రాంచ్ కెనాల్.. జీడిపల్లి రిజర్వాయర్ వరకూ పూర్తైనా.. పంపిణీ కాలువలు పూర్తి కాలేదు. గత ప్రభుత్వాల హయాంలో తవ్విన కాలువలు కూడా కంపచెట్లతో నిండిపోయి ప్రస్తుతం పూడిపోతున్నాయి. చేసేదేమీలేక కొందరు రైతులు సొంత ఖర్చుతోనే ప్రధాన కాలువ నుంచి పైపు లైన్లు వేసుకుని.. నీరు పొలాలకు పారించుకుంటున్నారు. ఫలితంగా పెట్టుబడి భారం అదనంగా పడుతోందని వాపోతున్నారు.
హంద్రీనీవా తొలిదశ కింద ఒక్క అనంతపురం జిల్లాలోనే లక్షా 18 వేల ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది ప్రణాళిక. డిస్ట్రిబ్యూటరీ కాల్వలు, పిల్ల కాల్వల పనులను 3 ప్యాకేజీలుగా విడగొట్టారు. ప్యాకేజీ 33 కింద 60 శాతం పనులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తవ్వాలంటే.. ఇంకో 30 ఎకరాల భూమిని సేకరించాలి. జగన్ అధికారంలోకి వచ్చాక ఆ సమస్యపైనే దృష్టిపెట్టలేదు. ఇక 34వ ప్యాకేజీ కింద దాదాపు 90శాతం పనులు గతంలోనే పూర్తవగా.. మిగతా 10 శాతం పనులు పూర్తిచేందుకు మరో 150 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది.
ఈ ప్యాకేజీ పనులూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక అనంతపురంజిల్లాలో అత్యధికంగా 80వేల ఎకరాలకు సాగనీరందించే 36వ ప్యాకేజీ కింద.. పెండింగ్ పనులు పూర్తిచేసేందుకు.. 336 కోట్ల రూపాయల అంచనాలతో 2015లో టెండర్లు పిలిచారు. ఇంకా 1400 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. టీడీపీ హయాంలో జరిగిన పనులు తప్ప.. కొత్తగా ఎక్కడా తట్టిమట్టి తీయలేదని రైతులే చెప్తున్నారు.