Nara Lokesh Yuvagalam Padayatra At 67th Day: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర.. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. జిల్లాలోని ఉలికుంట్లపల్లి విడిది కేంద్రం నుంచి 67వ రోజు పాదయాత్ర కొనసాగించిన లోకేశ్.. వివిధ వర్గాల ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగారు. పెద్దపప్పూరు మండలం సింగనగుట్టపల్లి వద్ద తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించగా... జేసీ సోదరులు దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు, జేసీ అస్మిత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. లోకేశ్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి డాన్స్ చేసి కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
మైనార్టీ, బుడగ జంగాలతో లోకేశ్ ముఖాముఖి: పాదయాత్రలో భాగంగా లోకేశ్... ముస్లింలు, మత్స్యకారులు, రజకులు, చేనేతలు, బుడగ జంగాలతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ పాలనలో పలు సమస్యలను ఎదుర్కొంటున్నామని, పలు సంక్షేమ పథకాలను నిలిపేశారని మైనార్టీ నేతలు లోకేశ్ ఎదుట వాపోయారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీల్లోని వృత్తిదారులకు ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందచేసి ఆదుకుంటామని లోకేశ్ వారికి హామీ ఇచ్చారు. 2008లో అప్పటి ప్రభుత్వం తెచ్చిన 144 జీవో వల్ల రిజర్వేషన్ కోల్పోయామని.. బుడగ జంగాలు లోకేశ్‌కు విన్నవించగా.. వారికి న్యాయం చేస్తామని లోకేశ్ భరోసా ఇచ్చారు.